
యువకుడి ఇంటి ఎదుట మౌనదీక్ష చేస్తున్న మానస
షాబాద్(చేవెళ్ల) : ప్రేమించాను.. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేసిన యువకుడి ఇంటి ఎదుట ఓ యువతి మౌనదీక్షకు దిగింది. తనకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేసింది. ఈ సంఘటన షాబాద్ మండల పరిధిలోని లక్ష్మారావుగూడలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని లక్ష్మారావుగూడకు చెందిన శేఖర్‌రెడ్డి తాళ్లపల్లిలో నర్సరీ నిర్వహిస్తున్నాడు. ఇతడి వద్ద తాళ్లపల్లికి చెందిన మానస పనిచేస్తుండేది.
ఈక్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించిన శేఖర్‌రెడ్డి మాయమాటలు చెప్పి తన వెంట తిప్పించుకొని లోబర్చుకున్నాడు. తల్లిలేని ఆమెకు జీవితాతం తోడుగా ఉండి కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని నమ్మించాడు. మూడు సంత్సరాలు వీరిద్దరు కలిసి తిరిగారు. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతిసారి నేడు..రేపు అంటూ శేఖర్‌రెడ్డి దాటవేస్తూ వచ్చాడు. దీంతో అనుమానం కలిగిన మానస అతడిపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో శేఖర్‌రెడ్డి తమ ఇద్దరి సామాజిక వర్గాలు వేరు.. మన పెళ్లికి తన తల్లిదండ్రులు, కుటుంబీకులు అంగీకరించరని స్పష్టం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకునేది లేదని చెప్పాడు.
దీంతో మోసపోయానని గుర్తించిన యువతి షాబాద్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు శేఖర్‌రెడ్డిని పిలిపించి విచారణ జరిపారు. మానసతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన నర్సరీలో పనిచేస్తుండేదని, అంతవరకే తనకు తెలుసని స్పష్టం చేశాడు. ఇరువర్గాలకు చెందిన వాళ్లం మాట్లాడుకుంటామని చెప్పి ఠాణా నుంచి వచ్చిన శేఖర్‌రెడ్డి పరారయ్యాడు. కుటుంబీకులు ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయారు. దీంతో తనకు న్యాయం చేయాలని మానస తండ్రితో కలిసి శేఖర్‌రెడ్డి ఇంటి ఎదుట బైఠాయించింది.
శేఖర్‌రెడ్డి తనను మోసం చేశాడని కన్నీటిపర్యంతమైంది. అతడితో తనకు పెళ్లి చేసేవరకు ఆందోళన విరమించబోనని తెలిపింది. శేఖర్‌రెడ్డి తనను వివాహం చేసుకోకుండా ఆత్మహత్యే శరణ్యమని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించింది. పోలీసులు, అధికారులు తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. మానస ఆందోళనకు గ్రామస్తులు మద్దతు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment