
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కేఎన్నార్ వినియోగిస్తున్న పార్టీ అధికారిక సెల్‌ఫోన్ నంబర్ స్పూఫింగ్‌కు గురైంది. ఈ పరిజ్ఞానాన్ని వినియోగించి పలువురికి ఫోన్‌కాల్స్ చేస్తున్న ఆగంతకులు వైఎస్ జగన్ మాదిరిగా మాట్లాడుతున్నట్లు గుర్తించారు. నేరగాళ్లు కొన్ని వాట్సాప్ నంబర్ల ద్వారా చాటింగ్‌లోకి కూడా వస్తున్నారు. దాదాపు పక్షం రోజులుగా పలువురు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే లు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు వివిధ నియోజకవర్గాలకు చెందిన కన్వీనర్లకు ఇలాంటి ఫోన్ కాల్స్ రావడంతో పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించారు.
15 రోజులుగా నకిలీ కాల్స్..
కేఎన్నార్ వినియోగిస్తున్న సెల్‌ఫోన్ నంబర్ లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం పేరుతో ఉంది. వైఎస్ జగన్ పార్టీ శ్రేణులు, నేతలతో సంప్రదించాలని భావించినప్పుడు కేఎన్నార్ ఈ నంబర్ ద్వారానే వారికి కాల్స్ చేస్తుంటారు. పార్టీకి చెందిన కీలక నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులతోపాటు వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తల సెల్‌ఫోన్లలో ఈ నంబర్ ఫీడ్ అయి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నంబర్‌ను సంగ్రహించిన కొందరు దుండగులు సైబర్ నేరానికి పాల్పడ్డారు. ఇంటర్నెట్‌లో లభించే స్పూఫింగ్ సాఫ్ట్‌వేర్ ఆధారం గా ఈ నెల 10వ తేదీ నుంచి వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలకు ఫోన్ కాల్స్ చేయడం ప్రారంభించారు.
జగన్ మాదిరిగా మాట్లాడుతున్న దుండగులు
నిర్ణీత రుసుము తీసుకుని స్పూఫింగ్ సాఫ్ట్‌వేర్, ఇతర సదుపాయాలను అందించే వెబ్‌సైట్లు ఇంటర్నెట్‌లో అనేకం ఉన్నాయి. ఇటీవల డార్క్ వెబ్ ద్వారా కూడా దీన్ని కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. వాస్తవానికి ఇది ఇంటర్నెట్ ద్వారా చేసే ఫోన్ కాల్. ఈ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని అందులోకి ఎంటర్ అయిన తరవాత సదరు దుండగుడి ఫోన్ నంబర్‌తోపాటు ఫోన్‌కాల్ అందుకోవాల్సిన వ్యక్తిది, ఫోన్ రిసీవ్ చేసుకునేప్పుడు అతడి సెల్‌ఫోన్‌లో ఎవరి నంబర్ డిస్‌ప్లే కావాలో పొందుపరుస్తారు. దుండగుడి నంబర్ నిక్షిప్తమయ్యే సర్వర్ మారుమూల దేశాల్లో ఉండటంతో గుర్తించడం కష్టం. స్పూఫింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా కాల్స్ చేస్తుండటంతో ఫోన్ అందుకునే వారికి కేఎన్నార్ నంబరు మాత్రమే డిస్‌ప్లే అవుతుంది. ఈ నకిలీ ఫోన్ కాల్‌ను వైఎస్సార్ సీపీ నేతలు అందుకున్న వెంటనే వైఎస్ జగన్ మాదిరిగా దుండగుడు మాట్లాడుతున్నాడు. తాను పాదయాత్రలో ఉన్నానని, మిగిలిన విషయాలు చర్చించేందుకు వేరే వ్యక్తి సంప్రదిస్తారని చెబుతూ ఫోన్ కట్ చేస్తున్నాడు. ఆ వెంటనే రెండో అంకం మొదలవుతుంది.
రూ.10 లక్షలు పంపాలంటూ మోసగాళ్ల వల..
దుండగులు +1(507)407–9047 నంబర్‌ను వినియోగిస్తూ వైఎస్సార్ సీపీ నేతలతో వాట్సాప్ చాటింగ్ చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ నంబర్‌లో ఎంపీ పూనమ్ మహాజన్ డీపీ కనిపిస్తోంది. తాను పూనమ్‌నని... ఇప్పుడే జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు కదా!.. అంటూ దుండగులు చాటింగ్ ఆరంభిస్తున్నారు. వైఎస్ జగన్ పాదయాత్రలో బిజీగా ఉన్నారని చెబుతూ వెంటనే రూ.10 లక్షలు విశాఖపట్నం పంపించాలని సైబర్ నేరగాళ్లు సూచిస్తున్నారు. అంతేకాదు... వైఎస్ జగన్ పాదయాత్రలో ఉన్నందున ఆయనకు కాల్ చేసి డిస్ట్రబ్ చేయవద్దని, ఆయనే మీకు కాల్ చేస్తారంటూ కూడా మోసగాళ్లు సూచించడం గమనార్హం.
దూషిస్తూ కొందరు నేతలకు హెచ్చరికలు...
కొందరు వైఎస్సార్ సీపీ నేతలకు వాట్సాప్, వీఓఐపీ ద్వారా కాల్స్ చేస్తున్న దుండగులు దూషణలకు దిగడంతోపాటు హెచ్చరికలు కూడా చేస్తున్నట్లు గుర్తించారు. ఇలా ఈ నెల 10వతేదీ నుంచి దాదాపు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలకు నకిలీ ఫోన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎ.హర్షవర్ధన్‌రెడ్డి, లీగల్ సెల్ ప్రెసిడెంట్ పి.సుధాకర్‌రెడ్డిలతో కూడిన బృందం సోమవారం హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదును అందచేసింది. పార్టీ, వైఎస్ జగన్ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు పథకం ప్రకారం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. దుండగులు ఏ ప్రాంతంలో ఉన్నా గుర్తించి పట్టుకుంటామని పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment