రుజుమార్గం
‘రమజాన్ ’ అత్యంత శుభప్రదమైన, పుణ్యప్రదమైన మహామాసం. అంతటి ఘనమైన పవిత్రమాసం నేడు ప్రారంభమవుతోంది. రమజాన్ ఆరాధనల కోసం ముస్లిం సమాజం పూర్తిస్థాయిలో సన్నద్ధమైపోయింది. ఎందుకంటే ఈనెల ప్రత్యేకత, ఔన్నత్యం అలాంటిది.
ఒకసారి ముహమ్మద్ ప్రవక్త(స) రమజాన్ విశిష్టతను గురించి వివరిస్తూ ఇలా అన్నారు. ‘ప్రజ లారా! ఒక మహత్తరమైన, శుభప్రదమైన పవిత్ర మాసం తన కారుణ్య ఛాయను మీపై కప్పబోతోంది. ఆ మాసంలోని ఒక రాత్రి వెయ్యి మాసాలకన్నా శ్రేష్ట మైనది. ఆ మాసం ఉపవాసాలను అల్లాహ్ మీకు విధిగా చేశాడు. ఆ రాత్రుల్ల్లో దైవసన్నిధిలో (తరావీహ్) ఆరాధన చేయడం నఫిల్‌గా నిర్ణయించాడు. ఎవైరైతే ఆ మాసంలో దైవ ప్రసన్నతను పొందడానికి ఒక సున్నత్, లేక నఫిల్‌గాని ఆరాధన చేసినట్లయితే, అది ఇతర దినాల్లో చేసే ఫర్జ్ ఆరాధనగా పరిగణించబడు తుంది. అలాగే ఆ మాసంలో ఒక విధిని నెరవేరిస్తే, ఇతర కాలంలో 70 విధులు నిర్వహించిన దానితో సమానంగా పుణ్యం లభిస్తుంది. రమజాన్ మాసం సహనం వహించవలసిన మాసం. రమజాన్ సాను భూతి చూపవలసిన మాసం. ఈ మాసంలో విశ్వా సుల ఉపాధిలో వృద్ధి వికాసాలు కలుగుతాయి. ఎవైరైనా ఈ మాసం లో ఒక ఉపవాసికి ఇఫ్తార్ చేయిస్తే వారి పాపాలు పరిహారమవు తాయి. నరకాగ్ని నుండి విముక్తి లభిస్తుంది. వారికి ఉపవాసం పాటించే వారితో సమానంగా పుణ్యం కూడా లభిస్తుంది’.
ఈ శుభవార్త విని ప్రజలు ఎంతగానో సంతోషిం చారు. కొంతమంది సందేహ నివృత్తికోసం, ‘మాలో ప్రతి ఒక్కరికీ ఇఫ్తార్ చేయించే స్థోమత లేకపోతే ఎలా? పేదవారు ఇంత గొప్ప పుణ్యానికి దూరమై పోతారు గదా!’ అని అడిగారు. అప్పుడు ప్రవక్త మహ నీయులు, ‘కొద్ది మజ్జిగతో లేక గుక్కెడు మంచినీళ్ళతో ఇఫ్తార్ చేయించినా దైవం వారికి కూడా అదే పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు’ అని చెప్పారు.
ఈ మాసం మొదటి భాగం కారుణ్యం, మధ్య భాగం మన్నింపు, చివరి భాగం నరకాగ్నినుండి విముక్తి. ఈ మాసంలోనే పవిత్ర ఖురాన్ గ్రంథ అవ తరణ ప్రారంభమైంది. పవిత్ర రమజాన్‌కు సంబం ధించి ప్రవక్త వారు అనేక శుభవార్తలు అంద జేశారు. వాటన్నిటినీ పూర్తి స్థాయిలో పొందడానికి మనం శక్తి వంచనలేని కృషి చేయాలి. ప్రవక్తవారి ప్రతి సంప్రదా యాన్నీ ఆచరించడానికి ప్రయత్నించాలి. నియమ బద్ధంగా రోజా పాటిస్తూ, ఐదుపూటల నమాజు, తరావీహ్, జిక్,్ర దరూద్, దుఆల్లో నిమగ్నం కావాలి. ఆర్ధిక స్థోమతను బట్టి దానధర్మాలు అధికంగా చేస్తూ ఉండాలి. సమాజంలోని అభాగ్యులను ఏమాత్రం విస్మరించకూడదు. సత్కార్యం ఆచరించే ఏచిన్న అవ కాశం వచ్చినా దాన్ని జారవిడుచుకోకూడదు. ఉప వాసం పాటిస్తూ అబద్ధమాడితే, అనవసరంగా కడుపు మాడ్చుకొని పస్తులుండడమే తప్ప ఎలాంటి ప్రయో జనం చేకూరదు. అనునిత్యం నాలుకలపై అల్లాహ్ పవిత్రనామం నర్తిస్తూ ఉండాలి.
అల్లాహ్ అందరికీ పవిత్ర రమజాన్ శుభాలతో పునీతులయ్యే భాగ్యం ప్రసాదించాలని మనసారా కోరుకుందాం.
(రమజాన్ మాసం ప్రారంభం సందర్భంగా )
- యం.డి.ఉస్మాన్‌ఖాన్