జన్మ, మృత్యువు ఒకే నాణానికి ఉన్న బొమ్మ, బొరుసూ వంటివి. జన్మకు, మృత్యువుకు మధ్య సాగే ఈ జీవన ప్రయాణంలో మనిషి చేసే పాప, పుణ్య కర్మల ఫలమే అతని ‘అంతిమ మృత్యు దశ’కి, ‘మరు జన్మ’కి కూడా ఆధారం. మృత్యువు ఒక్కొక్కరికి, ఒక్కో రూపంలో రావటం వెనుక రహస్యం ఇదే.
మృత్యువు ఒక వాస్తవికత. దానిని అందరూ ఎదుర్కోవాల్సిందే. నిజానికి మృత్యువు జీవితానికి ‘అంతిమ దశ’ కాదు. మరో కొత్త జీవితానికి ‘ప్రవేశ ద్వారం’ వంటిది. మనిషికి ‘జన్మ-మృత్యువు’కి సంబం ధించిన సత్యజ్ఞానం లేకపోవటం మరియు మహాకాలు డైన ‘పరమాత్మ’తో మనస్సు సంబంధం, స్మృతి లేని కారణంగా ‘మృత్యువు’ పేరు వింటేనే భయభ్రాంతు లకు లోనవుతున్నాడు. జీవన పర్యంతం మనిషి అజ్ఞా నానికి వశమై ‘‘ధన, గణ, యవ్వన గర్వం’’ అంటే ధనం, పదవి, యవ్వనం అశాశ్వత మైన ఈ మూడింటికి వశమై ఎంతో గర్వంతో ఈశ్వరుడిని విస్మరించి, ధర్మాచరణను ప్రక్కనపెట్టి తోటి వారికి దుఃఖాన్ని, నష్టాన్ని కల్గిస్తూ ఎంతో పాపాన్ని మూటగట్టుకొం టాడు. కానీ మృత్యువు, సమయం ఏది వచ్చినా పై ‘మూడూ’ పరిసమాప్తం అవుతాయి. కాగా చేసిన పాప కర్మల శిక్షల ఫలంగా అంతిమంలో ‘మరణవేదన’ అనుభవించిన పిమ్మట కానీ తనువు చాలించరు.
మనిషి వైజ్ఞానికంగా ఎంత ప్రగతిని సాధించినా మృత్యువును తప్పించలేడు. ‘వంద కోట్లకు’ అధిపతు లైనా ‘ఒక్క నిమిషం’ ఆయుష్షును కొనలేరు. ధన సంపాదనకై ధర్మ చింతనకు దూరమై ‘లక్షల రూపా యల’ ధనాన్ని కూడబెట్టినా ‘ఒక్క రూపాయి’ సుఖాన్ని కూడా పొందలేరు. ఇదే కర్మ సిద్ధాంతం. ‘‘మనిషి సంపాదించిన ధన సంపద- నేలమీద; పశు సంపద- గోశాలలో; ఆలి- ఇంటివాకిట వరకు; బంధువులు- బజారు వరకు; వదలిన శరీరం- శవం చితిమీదే మిగిలిపోతుంది. అవి అంతవరకే తోడువస్తాయి. మరణించిన వాడికి వెన్నంటి వచ్చేది ‘ధర్మాచరణ’ మాత్రమే. కాబట్టి గర్వాన్ని వదలిన మానవుడు సత్ప్రవర్తన ఫలితంగా సౌఖ్యాన్ని పొందుతాడు.
మృత్యువుని తప్పించలేరు. మరణం అంటే ఆత్మ తన శరీరమనే వస్త్రాన్ని మార్చుకోవటం, తన ‘అడ్రస్’ని మార్చుకోవటం మాత్రమే. ఆత్మజ్ఞాని ‘పరమాత్ముని స్మృతి’లో పండు తొడిమ నుంచి దానంతటదే వేరై కిందపడినంత సహజంగా శరీరమనే వస్త్రాన్ని వదలి పెడతాడు.
వర్తమాన సమయంలో అన్ని సమస్యలకు కారణం ‘‘ఆత్మజ్ఞానాన్ని’’ ఉపేక్షించటం, పరమాత్మతో బుద్ధి వియోగం, దేహాభిమానానికి వశమై రాగ, ద్వేషాదుల్లో ఇరుక్కుపోవటం, ఆత్మ స్వరూపాన్ని తెల్సుకొని అనుభవం చేసుకొన్న తర్వాతే భోగాలతో అనాసక్తత, ఈర్ష్య, లోభం, కామ, క్రోధాదులతో ముక్తి, తద్వారా ‘మృత్యు భయం’ నుంచి విముక్తి లభిస్తుంది. సదా ఈశ్వరీయ సేవలో...
- బ్రహ్మకుమారి వాణి