
తెలుగు ప్రజల ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగిస్తున్న వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: దేశంలో ఆందోళనలు సృష్టిస్తున్న మూకోన్మాద ఘటనలకు పాల్పడుతున్నవారెవరూ తమను తాము జాతీయవాదులుగా చెప్పుకోవద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనల్లో చట్టాల ద్వారా మాత్రమే మార్పు సాధ్యం కాదని.. సమాజ ప్రవర్తనలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. మూకోన్మాద ఘటనలపై రాజకీయాలు చేయాలనుకుంటున్న వారిపైనా వెంకయ్య మండిపడ్డారు. ఈ ఘటనలకు రాజకీయ పార్టీలతో ముడిపెట్టాల్సిన అవసరం లేదన్నారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మూక దాడుల ఘటనలను ఆపేందుకు చట్టం మాత్రమే సరిపోదు. సామాజిక మార్పు అవసరం.
మీరు జాతీయవాదులుగా చెప్పుకుంటున్నట్లయితే.. ఓ మనిషిని ఎలా చంపుతారు? ఓ వ్యక్తి మతం, కులం, వర్ణం, లింగం ఆధారంగా వివక్ష చూపిస్తారా? జాతీయవాదం, భారత్ మాతాకీ జై అనే పదాలకు విశాలమైన అర్థం ఉంది. మూకదాడుల ఘటనలు ఓ పార్టీ పని కాదు. మీరు ఈ వివాదాన్ని పార్టీలకు ఆపాదిస్తున్నారంటే విషయాన్ని పలుచన చేస్తున్నట్లే. ఇదే జరుగుతోందని స్పష్టంగా చెప్పగలను’ అని వెంకయ్య పేర్కొన్నారు. ‘నిర్భయ ఘటన తర్వాత నిర్భయ చట్టం వచ్చింది. అత్యాచారాలు ఆగిపోయాయా? నేను ఈ అంశంపై రాజకీయాలు మాట్లాడటం లేదు. పార్టీలు కొన్ని అంశాలపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి. ఒక బిల్లు ద్వారా, రాజకీయ తీర్మా నం, పాలనాపరమైన నిర్ణయంతోపాటుగా ఈ దుర్మార్గపు ఆలోచనను సమాజం నుంచి పూర్తిగా తొలగించేలా మార్పు తీసుకురాగలగాలి. ఇదే విషయాన్ని నేను పార్లమెంటులో కూ డా చెప్పాను’ అని వెంకయ్య స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment