వందేమాతరం.. మనదే ఈ తరం
వందేమాతరం.. మనదే ఈ తరం
Published Mon, Aug 15 2016 9:07 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
జయ జయ జయ ప్రియ
భారత జనయిత్రి దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నరనారీ హృదయనేత్రీ
భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
అంటూ.. చిన్నారుల దేశభక్తి గీతాలు, సమైక్యతను చాటేలా వ్యాయామ విద్యార్థుల విన్యాసాలు, జాతీయ భావాన్ని కలిగించే ప్రసంగాలతో ఏలూరు పోలీస్ పరేడ్ గ్రేండ్స్‌లో సోమవారం స్వాతంత్య్ర దిన వేడుకలు అంబరాన్నంటాయి.
–ఏలూరు (మెట్రో)
జిల్లావ్యాప్తంగా 70వ స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లాస్థాయిలో ఏలూరులో జరిగిన వేడుకల్లో దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బేటీ బచావో–బేటీ పడావో నినాదంతో సర్వశిక్షాభియాన్ శకటాన్ని ప్రదర్శించారు. ఆర్‌డబ్ల్యూఎస్, డీఆర్‌డీఏ, వైద్యారోగ్య శాఖ, 108, 104, చంద్రన్న సంచార చికిత్స, అటవీ శాఖ, వ్యవసాయ, ఐటీడీఏ శాఖలు శకటాలను ప్రదర్శించాయి.
విన్యాసం.. అబ్బురం
వేడుకలలో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ‘దేశమంటే మట్టికాదోయ్– దేశమంటే మనుషులోయ్’, కొవ్వలి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ‘జయహో..’, శర్వాణీ ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు ‘భరత ఖండమే నా దేశం’, గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ కళాశాల విద్యార్థులు ‘భారతీయం’, ఏలూరు రవీంద్రభారతి విద్యార్థులు ‘చెక్‌దే ఇండియా’, చైతన్య విద్యార్థులు ‘వందేమాతరం’ నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. గోపన్నపాలెం వ్యాయామ విద్యార్థులు అబ్బురపరిచే విన్యాసాలతో అలరించారు. విజేతలకు మంత్రి మాణిక్యాలరావు ప్రశంసా పత్రాలు అందించారు. గోపన్నపాలెం వ్యాయామ కళాశాల విద్యార్థుల నృత్యం మొదటి స్థానంలో నిలిచింది. కలెక్టర్ కె.భాస్కర్, ఎస్పీ భాస్కర్‌భూషణ్, డీఈవో డి.మధుసూదనరావు, డెప్యూటీ డీఈవో డి.ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement