గణేశుని ప్రతిమ నుంచి పత్రిని సేకరించి పూజించడం వరకూ... వినాయకచవితి ప్రతి అంశంలోనూ భక్తి మాత్రమే కాదు, విజ్ఞానమూ ఉంది. ప్రకృతి స్పృహ ఉంది. అందుకే ఇది పిల్లలకు పాఠాలు చెప్పే పండుగ. కంప్యూటర్ ఓపెన్ చేసి, మౌస్‌తో క్లిక్ చేస్తే చాలు మనం కావాలనుకున్న చోటికి వెళ్లిపోతాం. ప్రపంచమంతా మౌస్ మీద నడుస్తోంది. నేడే కాదు పురాణకాలంలో కూడా మౌస్ (ఎలుక) దే ఆధిపత్యం. వినాయకుని వాహనం అయిన మౌస్ (ఎలుక) ఎక్కడికి కావాలంటే అక్కడకు అయనను తీసుకువెళ్లేది. కంప్యూటర్ మౌస్ పిల్లలకు ఎంత అవసరమో, మౌస్ వాహనంగా ఉన్న వినాయకుడి ముందు భక్తి శ్రద్ధలతోఉండడం అంతే అవసరం. సర్వవిఘ్నాలను విఘ్నేశ్వరుడు తొలగిస్తాడు. అందుకే వినాయకచవితి పెద్దలకే కాక పిల్లల పండుగ కూడా అయింది.
తుండమునేకదంతము దోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడిపార్వతీ తనయ యోయి గణాధిపా నీకు మ్రొక్కెదన్...
అంటూ పిల్లల చేత గణనాయకునికి ప్రార్థనలు చేయిస్తారు. ఆరంభించిన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని ముందుగా గణనాయకుడిని ప్రార్థించండం మన సంప్రదాయం. పిల్లలు అత్యుత్సాహంతో జరుపుకునే పండుగ వినాయకచవితి. పండుగనాడు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకుని, వినాయకుడిని ఎంతో అందంగా అలంకరిస్తారు. విగ్రహాన్ని రకరకాలుగా తయారుచేసుకుంటారు. కంప్యూటర్ ముందు కూర్చున్న వినాయకుడు, రకరకాల కూరగాయలతో వినాయకుడు, ఆకులతో, పండ్లతో, డ్రైఫ్రూట్స్‌తో... ఎవరికి తోచిన ఆకృతిలో వారు ఆ గణనాయకుని పూజిస్తారు.ప్రతిమను ఉంచే గదిని సైతం తీర్చిదిద్దుతారు. గణేశ్ బర్త్‌డే అంటే పిల్లలకి అంత క్రేజ్ మరి. నేపాల్, చైనా, జపాన్, జావా దేశాలలో, ఇంకా జైన బౌద్ధులు సైతం వినాయకుడిని కొలుస్తారు.
పుస్తక పూజ...
విద్యార్థులు తమ పుస్తకాలన్నిటినీ వినాయకుడి దగ్గర ఉంచుతారు. వాటి మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును రాసి పూజ చేస్తారు. ఇలా చేయడం వల్ల చదువు బాగా వస్తుందని పెద్దల నమ్మకం. అయితే ఏదో మొక్కుబడిగా కాకుండా, పండుగలోని సామాజికస్పృహను, అంతరార్థాన్ని పెద్దలు పిల్లలకు వివరించి చెప్పాలి.
పూజలోని ఆంతర్యం...
విద్యార్థులకు చదువులో ఎన్నో ఆటంకాలు కలుగుతుంటాయి. వాటిని అధిగమించడానకి వినాయకుని తలను పూజించాలి. మెదడు ఎంత చురుకుగా పనిచేస్తే విద్య అంత చక్కగా ఒంటపడుతుంది. అందుకే తలను పూజించాలని చెబుతారు. చిన్న చిన్న విషయాలను జాగ్రత్తగా వింటూ అర్థం చేసుకునే శక్తి కోసం ఆయనకున్న చిన్న కళ్లను పూజించాలి. దేనినైనా సూక్ష్మంగా చూడవలసి వచ్చినప్పుడు క ళ్లను చిన్నవిగా చేస్తాం. అందుకే గణనాథుని కళ్లు చింతాకులంత చిన్నవిగా ఉంటాయి.
అన్ని విషయాలను ఏకాగ్రతతో వినడానికి వినాయకునికున్న చేటంత చెవులను పూజించాలి. అందుకే ఎవరైనా ఏదైనా విషయం చెప్పేటప్పుడు, ‘చెవుల్ని చేటల్లా చేసుకుని విను’ అనే మాట వాడుకలోకి వచ్చింది. పిల్లలు ఎప్పుడూ తమను తాము కించపరచుకోకుండా ఉండే లక్షణం కోసం ఆత్మగౌరవ చిహ్నమైన తుండాన్ని పూజించాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కనుక ఆ లక్షణాన్ని వినాయకుని ద్వారా తెలుసుకోవడానికి నోటిని పూజించాలి.
వినాయకుడి నోరు తొండం కింద దాగి ఉంటుంది. అంటే నోటిని అదుపులో ఉంచుకోమని చెప్పడమేనని అర్థం చేసుకోవాలి. చదువుకునేటప్పుడు, ‘నేర్చుకున్నది చాలులే’ అని తృప్తి చెందక మరింత జ్ఞానాన్ని సంపాదించడానికి ఆయన బొజ్జను అర్చించాలి. ధర్మార్థ కామ మోక్షాలను సాధించడానికి ఆయనకున్న నాలుగు చేతులను పూజించాలి. ఆటంకాలు కలిగినప్పుడు కుంగిపోకుండా, మనోబలం చేకూరాలంటే విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని ధ్యానించాలి.
వాహనం...
అన్నిటి కంటె విచిత్రమైన విషయం వినాయకుడి వాహనం అయిన ఎలుక. మిగతా దేవ తల వాహనాలతో పోలిస్తే అతి సామాన్యమైన వాహనం. అనవసరమైన కోర్కెలను అదుపులో ఉంచుకోవడం అలవర్చుకోవడం కోసం ఆ ఎలుకను తప్పనిసరిగా ప్రార్థించాలి.
తలచితి నే గణనాథుని
తలచితి నే విఘ్నపతిని దలచిన పనిగా
దలచితినే హేరంబుని
తలచిన నా విఘ్నములను తొలగుట కొరుకన్.
సామాన్య జీవనానికి అధిపతి విఘ్నేశ్వరుడు
విఘ్నాధిపత్యం కోసం ముల్లోకాలలోని నదులలో స్నానం చేసి ముందుగా ఎవరు వస్తారో వారిని గణాధ్యక్షుని చేస్తానని పరమేశ్వరుడు కుమారస్వామి, వినాయకుల మధ్య పోటీ పెట్టాడు. కుమారస్వామి నెమలి వాహనం మీద వేగంగా వెళ్లిపోయాడు. వినాయకుడిది ఎలుక వాహనం. దానికి తోడు కదలలేని శరీరం. ఏం చేయాలో తోచలేదు. తల్లిదండ్రులను మించిన దైవం లేదని తెలుసుకుని, రెండు చేతులూ జోడించి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు. కుమారస్వామి ఏ నదిలో స్నానం చేసినా తన కంటె ముందుగా స్నానం చేసి వస్తున్న వినాయకుడిని చూసి, విషయం తెలుసుకుని సిగ్గుపడ్డాడు. వినాయకుడు తల్లి ఆజ్ఞను శిరసావహించాడు. గణాధ్యక్షుడయ్యాడు. కుమారస్వామికి శక్తి ఉన్నప్పటికీ అహంకారం కారణంగా గణాధ్యక్ష పదవి కోల్పోయాడు. తల్లిదండ్రులను మించిన దైవం లేదని తెలుసుకున్నాడు. పెద్దల సన్నిధిలో ఉండటం వల్ల ప్రపంచంలో సాధించలేనిదంటూ లేదని ఈ కథ చెబుతోంది. అందుకే పిల్లలు తల్లిదండ్రులను దేవుడిగా భావించాలని ఈ కథ వివరిస్తోంది.
సామాన్య గణపతితో జాగ్రఫీ, ఆరోగ్యం...
వినాయకుడు భూతత్వాన్ని బోధిస్తాడు. పండగ దగ్గర పడుతోందంటే పిల్లలు చెరువుగట్లకు, కాలవ గట్లకు వెళ్లి మట్టి సేకరించి వాటితో వినాయకప్రతిమ తయారుచేస్తారు. దీని ద్వారా మట్టిని గురించి తెలుసుకుంటారు. అంతేకాక ఈ పండుగనాడు ప్రసాదాలు ఘాటుగా, వికారాన్ని కలిగించేవిగా కాక ఆరోగ్యకరమైనవి తయారుచేస్తారు. కేవలం ఆవిరి మీద ఉడకబెట్టిన వాటినే ప్రసాదంగా స్వీకరిస్తాడు వినాయకుడు. అదే సాత్విక మైన ఆహారం. జీర్ణక్రియను పాడుచేయదు. అలా పిల్లలకు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు లంబోదరుడు.
అటుకులు కొబ్బరి పలుకులు
చిటిబెల్లము నానుబ్రాలు చెఱకురసంబున్
నిటలాక్షునగ్రసుతునకు
పటుతరముగ విందు చేతు ప్రార్థింతు మదిన్.
పెద్దలను గౌరవించాలి
సందర్భం లేకుండా ఇతరులను చూసి నవ్వితే అపనిందలపాలవుతారని చంద్రుడి కథ, పరుల సంపదలకు ఆశపడకూడదని శ్యమంతకమణి కథ, తెల్లని వస్త్రాలు, పరిశుభ్రత, ప్రశాంతత వంటి అంశాలు వినాయకుని వేషధారణ తెలియచేస్తాయి. చిరునవ్వులు చిందించే ప్రశాంత వదనంతో ప్రారంభించిన పని నిర్విఘ్నంగా కొనసాగుతుందని గణేశుని ద్వారా తెలుస్తుంది. వినాయకుడే ఒక చదువు. ఆయన పూజకు చేసే ప్రతిపనిలో విద్య ఉంది. చదువుకునే పిల్లలు వినాయకుని పూజించి, ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయనంత గొప్పవారు కావాలి.
అవిఘ్నమస్తు...
గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర అఘనాశక
వినాయక ఈశ తనయ సర్వసిద్ధి ప్రదాయక ॥
జ్ఞానాకృతి వినాయకుడి ఆకారం...
ఏనుగుతల, పెద్ద బొజ్జ, పొట్టి రూపం. ఆ శరీరం పిల్లలకి సందేశం ఇస్తుంది. ఒక్కో భాగం ఒక్కో అంశానికి ప్రతీక. ఆటంకాలను తొలగించే తల, చిన్న విషయాలను కూడా గ్రహించగల శక్తి కలిగిన చిన్న కళ్లు, అన్ని విషయాలనూ శ్రద్ధగా వినే పెద్ద చెవులు, ఆత్మగౌరవం కలగడానికి చిహ్నంగా తుండం, తక్కువగా మాట్లాడమని సూచించే నోరు, అమితమైన జ్ఞానాన్ని సంపాదించుకోమని చెప్పే పెద్ద బొజ్జ, ధర్మం, అర్థం, కామం, మోక్షం సాధించడానికి నాలుగు చేతులు, కోరికలను అదుపులో పెట్టుకోవడానికి ప్రతీకగా ఎలుక వాహనం
శుభసూచకం
స్వస్తిక్ అంటే శుభాన్ని కలిగించేది. అందుకే పిల్లలు చదువుబాగా రావాలనే ఉద్దేశ్యంతో వారి పుస్తకాల మీద మొదటి పేజీలో పసుపుతో ఈ చిహ్నం రాసి దేవుని ముందుంచి పూజ చేస్తారు. యంత్రశాస్త్రంలో స్వస్తిక్ గణపతి ఆధిపత్యాన్ని చూపిస్తుంది. పని నిర్విఘ్నంగా పరిసమాప్తం కావడానికి ఈ చిహ్నం వేస్తారు. విశేష సమయాల్లో స్వస్తిక్ చిహ్నం గీయటం వల్ల ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతం అవుతాయనే విశ్వాసం ఉంది. గణేశునికి ప్రతీక అయిన చిహ్నం కనుక దీనిని శుభప్రదంగా భావిస్తారు.
పత్రిలో బోటనీ పాఠం
ఓషధీ గుణాలు కలిగిన ఆకులతో వినాయకుడిని పూజిస్తారు. శాస్త్రం చెప్పిన 21 రకాల పత్రులను పూర్వం పిల్లలే స్వయంగా గుర్తించి, తుంపి తెచ్చేవారు. వీటి ద్వారా జీవశాస్త్రం (బోటనీ) నేర్చుకోవడమే కాక పిల్లలకి ప్రకృతితో సంబంధం ఏర్పడుతుంది. ముఖ్యంగా భాద్రపదమాసంలో ఓషధులు అప్పుడే భూమిలోంచి బయటకు వచ్చి సజీవంగా ఉంటాయి. 21 రకాల పత్రులతోనూ వ్యాధిని నిర్మూలించే లక్షణం ఉంది. వానల వల్ల ఏర్పడిన తడి కారణంగా వచ్చే వ్యాధులన్నీ ఈ పత్రిలోని గరికతో నిర్మూలనమవుతాయి.
లంబోదరుడు - నిరాడంబరుడు
గణనాయకుడయినప్పటికీ సామాన్య జీవితాన్నే ఇష్టపడ్డాడు గణనాథుడు. సామాన్య జీవన విధానాన్ని అలవరచుకోవడానికి ఆయనను పూజించాలి. చిన్నతనంలో పిల్లలకి ఏది అవసరమో, ఏది అనవసరమో తెలియదు. చూసిన ప్రతిదీ కావాలనిపిస్తుంది. వినాయకుడిని ఆదర్శమూర్తిగా పిల్లలకు చూపించాలి. ఆయన జీవితాన్ని అర్థం చేసుకుని పిల్లలు చిన్నప్పటి నుంచే నిరాడంబర జీవితాన్ని గడపడానికి అలవాటు పడతారు. వినాయకతత్త్వం దేశభక్తి, సంస్కృతి పట్ల ప్రేమ, భక్తి, మన చుట్టూ ఇన్ని విలువైన వస్తువులున్నాయని తెలియచేస్తుంది. తద్వారా మన నేల గొప్పదనం, ఆత్మీయత, నిరాడంబర జీవితం గడపడం పిల్లలు తెలుసుకోగలుగుతారు.
-డా.పురాణపండ వైజయంతి
గణాధిప నమస్తేస్తు...
Published Mon, Sep 9 2013 4:53 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
Advertisement
Advertisement