కువైట్‌లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతి వేడుకలు కువైట్‌లో ఘనంగా నిర్వహించారు. వైఎస్‌ఆర్‌సీపీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి సమాచారం మేరకు.. కువైట్‌లో మాలియా ప్రాంతంలో ఉన్న తెలుగు చర్చిలో వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కువైట్ కమిటీ సీనియర్ నాయకుడు ఆకుమర్తి లాజరస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్ పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమపథకాలు అమలుచేశారని కొనియాడారు.
అలాగే గల్ఫ్ దేశాల్లో తెలుగు వారి సమస్యల పరిష్కారం కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రత్యేకమంత్రిని నియమించారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ లేనిలోటు ప్రవాసాంధ్రులకు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. అనంతరం వారు గడప గడపకు వైఎస్‌ఆర్ కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పి.రెహమాన్‌ఖాన్, నాయని మహేష్‌రెడ్డి, తెలుగు క్రైస్తవ సంఘం వ్యవస్థాపకులు అపో. డాక్టర్ లివింగ్‌స్టన్లతో పాటూ భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.