
మిన్నెసోటాలో ఘనంగా బోనాల పండుగ
మిన్నెసోటా(యూఎస్): మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్(మాట) ఆధ్వర్యంలో బోనాలు, వనభోజనాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు కుటుంబాల కోలాహలంతో హేలాండ్ పార్క్ కళకళలాడింది. మాట అధ్యక్షులు మహేందర్ గినుగ, వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ అల్లంనేని, బుచ్చిరెడ్డి ముదిరెడ్డిల పర్యవేక్షణలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.
మాట వారు పచ్చని పందిరిలో అమ్మవారిని పీఠంపై ఉంచి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని తెలుగు వారందరూ పట్టు వస్త్రాలు ధరించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాలు తెచ్చిన వారందరు అమ్మవారిని పూజించి, దీవెనలు అందుకున్నారు. అనంతరం మాటవారు ఏర్పాటు చేసిన విందు భోజనం అందరూ ఆరగించారు.