వేడుకగా నాట్స్ అవార్డుల ప్రదానోత్సవం
లాస్‌ఏంజిల్స్ నుంచి సాక్షి ప్రతినిధి: నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) మహాసభలు స్థానికంగా గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీనటుడు బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా, ప్రముఖ వైద్యుడు ఎల్.ప్రేమ్‌సాగర్‌రెడ్డి అవార్డులు అందజేశారు. సినీనటుడు సాయికుమార్, సంగీత దర్శకుడు కోటి, ప్రముఖ తెలుగు రచయిత కొలకలూరి ఇనాక్ తదితరులు అవార్డులు అందుకున్నారు. కూచిబొట్ల ఆనంద్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అలాగే అమెరికాలో వివిధ రంగాల్లో రాణించిన కె. ఉమామహేశ్వరి, కిరణ్ ప్రభ, రాజురెడ్డి, రమేశ్, పి.పి.రెడ్డి, దేశి గంగాధర్, వై.వి.నాగేశ్వర్‌రావుకు అవార్డులు అందజేశారు.
నాట్స్ మహా సభల సమన్వయకర్త ఆలపాటి రవి, బోర్డు చైర్మన్ కొర్రపాటి మధు, వ్యవస్థాపక అధ్యక్షుడు మాదాల రవి, అధ్యక్షుడు ఆచంట రవి, సినీనటులు తనికెళ్ల భరణి, కాజల్, అలీ, సంగీత దర్శకుడు వందేమాతం శ్రీనివాస్ తదితరులు సభలకు హాజరయ్యారు.