
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి దుర్మరణం
* మరో విద్యార్థికి గాయాలు
* ఆగి ఉన్న బుల్డోజర్‌ను ఢీకొన్న కారు
* నిద్రమత్తు వల్లే ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థిని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. సుదూర డ్రైవింగ్ వల్ల కలిగిన అలసట, నిద్రమత్తు రూపంలో మృత్యువు కబళించింది. 6రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని సైదాబాద్ ఎస్‌బీహెచ్ కాలనీకి చెందిన గుండా నితిన్ (21) ఏడాదిన్నర క్రితం అమెరికాలోని క్యాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసేందుకు వెళ్లాడు. ఓక్లహోమా రాష్ట్రంలో నివసిస్తున్న బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో ముగ్గురు మిత్రులతో కలసి కారులో 1,970 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడకు చేరుకున్నాడు.
అయితే తిరుగు ప్రయాణంలో కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించాక...అప్పటికే డ్రైవింగ్ వల్ల అలసిపోయిన నితిన్ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో కారు ఒక్కసారిగా ప్రధాన రహదారి ఎడమవైపున ఉన్న కన్‌స్ట్రక్షన్ జోన్‌లో పార్క్‌చేసి ఉన్న బుల్డోజర్(డీ6 డాజర్)ను బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ నితిన్ అక్కడికక్కడే మృతిచెందగా మరో స్నేహితుడు, హైదరాబాద్‌వాసి వివేక్ గాయపడ్డాడు. మరో ఇద్దరు స్నేహితులు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వివేక్‌ను మిగిలిన స్నేహితులు ముస్కోగీలోని ఈస్టర్ హెల్త్ సిస్టమ్‌లో చేర్పించారు. నితిన్ సహా స్నేహితులంతా సీటు బెల్ట్‌లు ధరించినా, ఎయిర్ బెలూన్లు తెరుచుకున్నా అవి నితిన్ ప్రాణాలను రక్షించలేకపోయాయి. ప్రమాద సమయంలో కారు 100 కి.మీపైగా వేగంతో వెళ్తున్నట్లు తెలుస్తోంది.
కన్నీరుమున్నీరు..
నితిన్ మరణవార్త తెలియగానే అతని తల్లిదండ్రులు షాక్‌కు గురై ఆస్పత్రిపాలయ్యారు. ఏకైక సంతానమైన నితిన్ లేడన్న విషయం తెలియడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. డిసెంబర్‌లో హైదరాబాద్ వచ్చేందుకు నితిన్ ఏర్పాట్లు చేసుకున్నాడు. నితిన్ మృతదేహం శనివారం హైదరాబాద్‌కు వచ్చే అవకాశముంది. నితిన్ ఇబ్రహీంపట్నంలోని సీవీఆర్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. ఎస్‌బీహెచ్ కాలనీకే చెందిన వివేక్ నితిన్‌తోనే చదువుతున్నాడు. నితిన్ తండ్రి శ్రీనివాస్ ఎస్‌బీహెచ్‌లో స్పెషల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు.