మోదీ పాలనను ప్రపంచం గమనిస్తోంది
నాట్స్ ముగింపు సభలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు
లాస్‌ఏంజెలిస్ నుంచి సాక్షి ప్రతినిధి: ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతున్నాయని, త్వరలో అగ్రరాజ్యాల సరసన భారత్ నిలుస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు వెల్లడించారు. శనివారం రాత్రి లాస్‌ఏంజెలిస్‌లో జరిగిన నాట్స్ ముగింపు సభలో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ప్రధాని మోదీ పరిపాలన గురించి చెప్పుకుంటున్నారని అన్నారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందని ‘‘ ఏబుల్ లీడర్- స్టేబుల్ గవర్నమెంట్’’ ఏర్పడిందని తెలిపారు. మోదీ 3డీ లాంటివాడని డైనమిక్, డెసిషన్, డెవలప్‌మెంట్ అనే భావంతో పరిపాలన సాగుతోందని పేర్కొన్నారు. నాట్స్ చేస్తున్న సేవలను వెంకయ్య ప్రశంసించారు. నాట్స్ చేపట్టిన ‘‘ భాషే రమ్యం-సేవే గమ్యం’’ అనే నినాదం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని వెంకయ్య పేర్కొన్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త జీఎంఆర్‌తో పాటు తాను విశాఖలో కలసి చదవుకున్నానని, ఆయన చేతులమీదుగా నాట్స్ అవార్డును తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో జీఎంఆర్‌తో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, అయ్యన్నపాత్రుడు, పరిటాల సునీత, అమెరికా పారిశ్రామిక వేత్త డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి, డాక్టర్ ఆలపాటి రవి, ఆచంట రవి, దేశు గంగాధర్, పాపుదేశి ప్రసాద్ తదితరుల ఆధ్వర్యంలో అతిథులను అవార్డులతో సత్కరించారు. నాట్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాదాల రవిని వెంకయ్యనాయుడు సత్కరించారు. అనూప్‌రూబెన్స్ సంగీత విభావరి ఆకట్టుకుంది. 3 రోజుల నాట్స్ సభలను విజయవంతం చేసిన అందరికీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాదాల రవి, ప్రస్తుత అధ్యక్షుడు ఆచంట రవి, సమావేశాల సమన్వయకర్త ఆలపాటి రవి కృతజ్ఞతలు తెలిపారు.