అభివృద్ధిని ఓర్వలేకనే అడ్డుకుంటున్నారు
కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తిన వెంకయ్యనాయుడు
జీఎస్‌టీ ఆమోదం విషయమై అన్ని పార్టీలతో మాట్లాడుతాం
బెంగళూరు : ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల వల్ల జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక పోతున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ధ్వజమెత్తారు. అందువల్ల దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే కీలక బిల్లులు చట్టసభల్లో ఆమోదం పొందకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బెంగళూరులో శుక్రవారం సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ముద్రా బ్యాంక్, తదితర అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల దేశంలో పెట్టుబడులు పెరుగుతున్నాయన్నారు. దీంతో ప్రస్తుతం దేశ జీ.డీ.పీ గతంలో ఎప్పుడూ లేన ంతగా 7.5గా ఉందన్నారు. ఇదే విధంగా భారత దేశం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తే రానున్న రెండేళ్లలోనే ఆర్థికాభివృద్ధిలో చైనాను మించిపోతుందని ప్రపంచబ్యాంకు వంటి సంస్థలే చెబుతున్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఇలా ఎన్‌డీఏ పాలనకు దేశంలోని వివిధ వర్గాల ప్రజల నుంచే కాక ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ప్రశంసలను ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు జీఎస్‌టీ బిల్లులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జీ.ఎస్.టీ బిల్లు అమల్లోకి వస్తే భారత జీ.డీ.పీ మరో 2 శాతం వరకు పెరుగుతుందన్నారు. ఇందుకు ప్రభుత్వం చేస్తున్న చర్యలను అడ్డుకోవాలనే ఏకైక లక్ష్యంతోనే అత్యంత విలువైన వర్షాకాల పార్లమెంటు సమావేశాలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారన్నారు. తమతో పాటు మిగిలిన అన్ని పార్టీలు వర్షాకాల సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించాలని చెప్పినా కాంగ్రెస్ మాత్రం మొండిపట్టు వీడక పోవడంతో సభాసమయం వృథా అయిపోయిందన్నారు. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్‌లోపు జీ.ఎస్.టీ బిల్లును ఎలాగైనా సరే అమల్లోకి తీసుకురావాల్సి ఉందన్నారు. అందువల్ల తాము అన్ని పార్టీనాయకులతో మాట్లాడి ఈ బిల్లు ఆమోదం పొందడానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతో పాటు మిగిలిన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని వెంకయ్యనాయుడు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్లమెంటు వెల్‌లోకి దూసుకుపోయి కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదన్నారు.
ఇప్పటి వరకూ ఓ ప్రధాన పార్టీ అధ్యక్షులు ఎవరూ ఇలా ప్రవర్తించి ప్రజాస్వామ్యాన్ని అవమాన పరిచిన దాఖలాలు లేవన్నారు. ఇలాంటి పరిస్థితులు మరోసారి ఉత్పన్నం కాకుండా పార్లమెంటు నియమావళిలో కొన్ని మార్పులు చేయడంతో పాటు వాటిని ఉల్లంఘించిన వారి పై చర్యలు తీసుకోవడంపై విస్తృత చర్చ జరిపి ఆమేరకు మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడంపై మీరేమంటారు అన్న ‘సాక్షి’ ప్రశ్నకు వెంకయ్యనాయుడు బదులు చెప్పకుండా విలేకరుల సమావేశం నుంచి వడివడిగా వెళ్లిపోయారు.