పడికట్టు పదాల్ని పక్కనపెట్టండి
కమ్యూనిస్టులకు కేంద్ర మంత్రి వెంకయ్య హితవు
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెట్టుబడిదారుల వద్ద మోకరిల్లుతున్నారంటూ కమ్యూనిస్టులు విమర్శించడాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. మోదీకి ప్రపంచమే జయజయ ధ్వానాలు పలుకుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు ఇంద్రసేనారెడ్డి, అశోక్ కుమార్ తదితరులతో కలసి శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పెట్టుబడిదారీ, బూర్జువా వంటి పడికట్టు పదాలను మాట్లాడటం మానేయాలని సూచించారు. మళ్లీ మమేకమయ్యేందుకు కమ్యూనిస్టులంతా యత్నించడాన్ని అభినందించారు. జనతా పరివార్‌తో ఆరు రాజకీయ పార్టీలు కలయిక సంతోషకరమేనన్నారు. కనీసం ఆరేళ్లయినా కలసి ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు రాగా తర్వాత మాట్లాడదామంటూ వెంకయ్య బదులిచ్చారు. అకాల వర్షాలవల్ల నష్టపోయిన ఇరు తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు పర్యటించారని, దీనిపై ఈ నెల 19న ప్రధానికి నివేదిక అందజేస్తామన్నారు.
ఈ సమావేశాల్లోనే భూ సేకరణ బిల్లు : బడ్జెట్ రెండో విడత సమావేశంలోనే ప్రస్తుతం ఆర్డినెన్స్ రూపంలో ఉన్న భూసేకరణ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని వెంకయ్య చెప్పారు. దీంతోపాటు నల్లధనం వెలికితీతకు ఉపయోగపడే ‘విదేశీ ఆస్తుల పన్ను’ విధింపు చట్టం, పన్నుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే జీఎస్‌టీ బిల్లు, రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేజేషన్ బిల్లులు కూడా రాబోతున్నాయన్నారు.