సీఎం పీఠం అంటే ఎవరికి చేదు
ముగ్గురు సీఎం అభ్యర్థులతో బీజేపీకి తలనొప్పి
రాజుకుంటున్న ఎన్నికల వేడి
చెన్నై, సాక్షి ప్రతినిధి: సీఎం పీఠం అంటే ఎవరికి చేదు, అందరికీ తీపే. అయితే ఒకే పీఠం కోసం ముగ్గురు పోటీపడితే ఎలా అంటూ కమలనాథుల కూటమి (బీజేపీ) తలపట్టుకుని కూర్చుంది. అకస్మాత్తుగా ముంచుకొచ్చిన వర్షాలు, వరదలు అధికార పార్టీ ప్రతిష్టను దిగజార్చగా, ఇదే అదనుగా అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు అన్ని పార్టీలు పోటీపడుతున్నాయి. ఈనెల మొదటి వారంలో కురిసిన వర్షాలు చెన్నై నగరాన్నే కాదు, అధికార పార్టీ గెలుపు అవకాశాలను ముంచేశాయి. కోల్పోయిన ప్రతిష్టను తిరిగి దక్కించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తంటాలు పడుతోంది. అధికార పార్టీ బలహీనతే బలంగా మార్చుకుని జార్జికోటపై జెండా ఎగురవేయాలని ప్రతిపక్ష పార్టీలు తహతహలాడుతున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉండటాన్ని అడ్డుపెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగుర వేయాలని భారతీయ జనతా పార్టీ ఆశిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా తరచూ తమిళనాడు పర్యటనలు చేయడం కమలనాథుల్లో ఉత్సాహం నింపుతోంది. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తుపెట్టుఖాయమని ఓవైపు ప్రచారం జరుగుతున్నా కూటమి ఏర్పాట్లలో కమలనాథులు మునిగిపోయి ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల త రహా కూటమితో ఎన్నికల రంగంలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఎన్‌డీఏను మరింతగా బలపడుతున్నదని జాతీయ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఎన్‌డీఏ కూటమిలోని డీఎండీకే అధినేత విజయకాంత్ తాను సీఎం అభ్యర్థిని అని ప్రకటించేసుకున్నారు.
పొత్తుదిశగా ఉన్న పీఎంకే సైతం పార్టీ యువత విభాగం అధ్యక్షులు అన్బుమణి రాందాస్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేసి ప్రచారం సైతం మొదలుపెట్టింది. పొత్తు చర్చల్లో ఇక బీజేపీ అభ్యర్థిని రంగంలోకి దించే అవకాశం ఉంది. అయితే సీఎం అభ్యర్థి బీజేపీ నుంచే రావాలని తాము ఎన్నడూ అనలేదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు వ్యాఖ్యానించారు. అయితే గత కొంతకాలంగా తమిళనాడు ఆడపడుచు, కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ను బీజేపీ సీఎం అభ్యర్థిగా పోటీకి పెట్టాలని వినపడుతోంది. బలమైన కూటమి ఏర్పడిన పక్షంలో సీఎం అభ్యర్థిత్వాన్ని త్యాగం చేసేందుకు బీజేపీ సిద్ధంగాఉన్నట్లు తెలుస్తోంది.
వాడి వేడి రాజకీయాలు
అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఒంటరిపోరుకు సుముఖంగా లేని ప్రతిపక్ష పార్టీలు కూటమి ఏర్పాట్లలో తలమునకలై ఉన్నాయి. ప్రస్తుత చట్టసభ కాలపరిమితి ఈ ఏడాది మే 23వ తేదీతో ముగుస్తుంది. ఈ కారణంగా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీచేసి ఏప్రిల్ లేదా మే మొదటి వారానికి ఎన్నికలను పూర్తిచేసి ఫలితాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. అన్నాడీఎంకే, డీఎంకే, డీఎండీకేలు ఎన్నికల ఫలితాలను శాసిస్తాయని భావిస్తున్నారు. ఎంతోకొంత బలమున్న ఇతర ప్రాంతీయ పార్టీలతో పొత్తుపెట్టుకోవడం ద్వారా బలమైన కూటమిగా రంగంలోకి దిగేందుకు సమాయత్తం అవుతున్నారు.
ఎవరికి వారు ఇతర పార్టీలకు ఆహ్వానం పలుకుతున్నా ప్రధాన పార్టీల నుంచి ఎవ్వరూ నోరు మెదపడం లేదు. మక్కల్ నల కూట్టని పేరుతో ఎండీఎంకే, వీసీకే, వామపక్షాలు ఏకమయ్యాయి. తమతో చేతులు కలపాల్సిందిగా ఈ కూటమినేతలు డీఎండీకేకు ఆహ్వానం పలుకుతున్నారు. అయితే విజయకాంత్ తన సహజ ధోరణిలో మౌనం పాటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈనెల 31వ తేదీన పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించేలా అన్నాడీఎంకే ప్రకటించింది. ఈ సమావేశంలోనే ఎన్నికల్లో అన్నాడీఎంకే వైఖరిని పార్టీ అధినేత్రి జయలలిత ప్రకటిస్తారని ఎదురుచూస్తున్నారు. డీఎంకే సైతం తన మాజీ మిత్రపక్షం కాంగ్రెస్ వైపుగా అడుగులు వేస్తోంది.
అన్నాడీఎంకేతో పొత్తు కుదిరిన పక్షంలో బీజేపీ కూటమి నుంచి డీఎండీకే దూరం జరగడం ఖాయం. అంతేగాక సీఎం అభ్యర్థిగా జయలలిత తథ్యం కాబట్టి ముగ్గురు సీఎం అభ్యర్థుల తలనొప్పుల నుంచి బీజేపీకి విముక్తి లభిస్తుంది. పార్లమెంటు ఎన్నికల సమయంలో మూడో కూటమిగా రంగంలోకి దిగిన బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అదే వైఖరా లేదా అన్నాడీఎంకేతో చేతులు కలుపుతుందా అనేది అన్ని పార్టీల నేతల బుర్రలను తొలిచేస్తోంది. అన్నాడీఎంకే, బీజేపీలు ఏకమైన పక్షంలో ఇతర పార్టీల ఎన్నికల ఎత్తుగడలు, వ్యూహాలే మారిపోగలవు.