సాక్షి, కర్నూలు: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన మాటను తప్పుతున్నారని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ విమర్శించారు. ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదని హెచ్చరించారు. మంగళవారం కర్నూలులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో రాజకీయ ‘ఘనులు’ పెరిగిపోయారని కేంద్రాన్ని ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో సాక్షాత్తు పార్లమెంట్‌లో ఇచ్చిన హామీల అమలు జరగడం లేదని వాపోయారు.
కేంద్రం వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన అనంతరం వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఓట్లు, సీట్ల కోసమే ఎన్నికల వేళ రాష్ట్రంలో హామీల వర్షం కురిపించిందని విమర్శించారు.
వ్యయ‘సాయం’లేదు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని జేపీ మండిపడ్డారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం శోచనీయమన్నారు. కరువు ప్రాంతం రాయలసీమ దీనికి ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన తెలిపారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం రైతు శ్రేయస్సుకై చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు కేంద్రం కార్యచరణ రూపొందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment