హోదాపై వాగ్దాన భంగం
- ప్రత్యేక హోదా ఊసెత్తని ప్రధానమంత్రి
- కలగానే మిగిలిన విశాఖ రైల్వే జోన్
- నత్తనడకన పోలవరం ప్రాజెక్టు పనులు
- విభజన చట్టంలోని హామీల అమలేది?
- రెండేళ్లలో రాష్ట్రానికి నిరాశే మిగిల్చిన మోదీ
- కేంద్రాన్ని నిలదీయలేకపోతున్న సీఎం బాబు
సాక్షి, హైదరాబాద్: ‘‘విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటాం..’’ ఏపీలో 2014 సాధారణ ఎన్నికల బహిరంగ సభల్లో అప్పటి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ఇది. 2014లో ఎన్నికలు ముగిశాయి. మిత్రపక్షాలైన బీజేపీ కేంద్రంలో, టీడీపీ ఏపీలో గెలిచి అధికారాన్ని చేపట్టాయి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం పంచుకున్నాయి. కానీ, అభివృద్ధి కోసం మాత్రం కలిసి పనిచేసిన దాఖలాలు లేవు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యలు చేపట్టి నేటికి రెండేళ్లు. రాష్ట్రానికి ఆయన ఇచ్చిన హామీల అమలును ఒక్కసారి పరిశీలిస్తే నిరాశే మిగులుతోంది.
‘హోదా’పై మాట తప్పారు:
ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని రాష్ట్ర విభజన సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే పదేళ్లు హోదా ఇస్తామని బీజేపీ వెల్లడించింది. విభజన చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామని, ఏపీని ఆదుకునే విషయంలో ముందుంటానని మోదీ పలుమార్లు ప్రకటించారు. రాష్ట్రాభివృద్ధికి అత్యంత ప్రధానమైన ‘ప్రత్యేక హోదా’ విషయంలో ఆయన మాట తప్పారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యూపీఏ సర్కారు ప్రకటించినట్లు ఏపీకి ఐదేళ్లు కాదు, పదేళ్లు హోదా ఇస్తామని మోదీ చెప్పారు. ఆధికారం చేపట్టాక నాన్చివేత ధోరణితో వ్యవహరిస్తున్నారు.
హోదా కాదు, అంతకంటే ఎక్కువే ఇస్తామని చెబుతున్నా రాష్ట్ర ప్రజలు ఆయన మాటలను విశ్వసించలేకపోతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని పలువురు కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంలో కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. కేంద్రంలోని తమ మంత్రులతో రాజీనామా చేయిస్తామని చెబితే మోదీ దిగివచ్చే అవకాశం ఉన్నా చంద్రబాబు వెనుకంజ వేస్తున్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని, హోదా తెచ్చుకున్న రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రత్యేక హోదాకు బదులుగా అందుకు సమానంగా నిధులు ఇస్తే మంచిదేనని చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. హోదా విషయంలో మోదీ, చంద్రబాబుల మాటలు నమ్మి మోసపోయామనే భావన ప్రజల్లో నెలకొంది.
రైల్వేజోన్ ఏర్పాటయ్యేనా?!
కీలకమైన విశాఖ రైల్వే జోన్ హామీని కూడా కేంద్రం ఇప్పటికీ నిలబెట్టుకోలేదు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అయిన విశాఖ రైల్వే జోన్ ఏర్పాటయ్యే అవకాశం కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. ఇక పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ పనులు నత్తనడకనే సాగుతున్నాయి. ప్రాజెక్టును పూర్తిచేసే విషయంలో చంద్రబాబు చొరవ చూపడం లేదు. కేంద్రం ఈ ప్రాజెక్టును పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంటేనే పనులు త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉంది. విభజన చట్టంలోని పలు హామీలు ఇంకా అమలుకు నోచుకోవడం లేదు. చట్టంలో పేర్కొన్న విద్యా సంస్థలు ఏర్పాటు కాలేదు. నరేంద్ర మోదీ ప్రత్యేకంగా శ్రద్ధ చూపితే తప్ప హామీలకు మోక్షం లభించదు.
ఇక నిధుల విషయంలో బీజేపీ, టీడీపీ నేతలు పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీలో ఎంతో సాయం చేశామని బీజేపీ నేతలు చెబుతుండగా... టీడీపీ నాయకులు ఆ వాదనను ఖండిస్తున్నారు. ఈ నెల 27 నుంచి 29 వరకూ తిరుపతిలో జరి గే మహానాడులో పంచేందుకు ‘ఏపీ అభివృద్ధికి కేంద్రం సాయం’ అనే క రపత్రాన్ని తయారు చేస్తున్నారు.