ప్రధాని మోదీని బహిష్కరిస్తాం
కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ హెచ్చరిక
► మన్మోహన్ ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యలపై ఉభయ సభల్లో రభస
► ప్రధాని క్షమాపణకు డిమాండ్
► మోదీ మూర్ఖుడు, అహంకారి: కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ
► ప్రధాని పదవి ఔన్నత్యాన్ని మోదీ దిగజార్చారు: రాహుల్
► కాంగ్రెస్‌కు క్షమాపణలు కోరే నైతిక హక్కు లేదన్న బీజేపీ
► సోనియా ‘మృత్యు బేహారీ’ విమర్శను గుర్తు చేసిన అమిత్‌షా
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ప్రధాని మోదీతోపాటు అధికార బీజేపీపై ఘాటైన విమర్శలు చేసింది. ప్రధాని క్షమాపణలు చెప్పని పక్షంలో బడ్జెట్ సమావేశాల్లో మోదీని బహిష్కరిస్తామని హెచ్చరించింది. మాజీ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ‘పార్లమెంటులో మేం ప్రధానిని బహిష్కరిస్తాం. ఆయన మాటలను మేం వినదలచుకోలేదు. అలాగని ప్రధానమంత్రి కార్యాలయం గౌరవమర్యాదలకు భంగం కలిగించకుండానే మా నిరసన కొనసాగిస్తాం. ఆయనో మూర్ఖుడని మాకు తెలుసు. ఓ అహంకారి ప్రధానమంత్రి సీట్లో కూర్చోవటం బాధాకరం’ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ఘాటుగా విమర్శించారు.
రాజకీయ చర్చల్లో వినకూడని భాషను మోదీ వాడతారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం పరువుతీస్తున్నారని.. ఆయనపై వస్తున్న విమర్శలపై మోదీ అసహనంతో ఉన్నారన్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఆయన భాష మారటం లేదన్నారు. మన్మోహన్ సింగ్‌ను, మాజీ ప్రధాని ఇందిర గురించి అవమానకర రీతిలో మాట్లాడారన్నారు. పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగాన్ని మోదీ అవమానించటాన్ని సహించేది లేదని శర్మ స్పష్టం చేశారు.
ఉభయసభల్లో నిరసన
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ గురువారం ఉభయ సభల్లో నిరసనను వ్యక్తం చేసింది. ప్రధాని క్షమాపణకు పట్టుబట్టడంతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. అటు లోక్‌సభలోనూ జైట్లీ ప్రసంగాన్ని విపక్షం పలుమార్లు అడ్డుకుంది. గురువారం ఉదయం కాంగ్రెస్ పార్టీ.. జేడీయూ, వామపక్షాలు, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీల నేతలతో వ్యూహాత్మక సమావేశం ఏర్పాటుచేసింది. మలిదశ బడ్జెట్ సమావేశాల్లో తమ వ్యూహాన్ని అమలుచేస్తామని ప్రకటించింది. అటు, ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ‘ప్రధాని పదవి ఔన్నత్యాన్ని మోదీ దిగజార్చారు’ అని విమర్శించారు.
బీజేపీ ఎదురుదాడి: కాంగ్రెస్ హెచ్చరికలపై బీజేపీ తీవ్రంగా ప్రతిఘటించింది. మోదీ క్షమాపణలు చెప్పాలని కోరే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని, కాంగ్రెస్సే మోదీకి క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రధాని వ్యాఖ్యలు దురదృష్టకరమంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన విమర్శలను బీజేపీ చీఫ్ అమిత్‌షా తిప్పికొట్టారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్నుద్దేశించి ‘మృత్యు బేహారీ’ అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు గుర్తుచేసుకోవాలని సూచించారు.
‘కాంగ్రెస్‌కు ఆ హక్కు లేదు’
పార్లమెంట్ కార్యకలాపాలను ప్రతిపక్షా లు అడ్డుకోవడంపై పార్లమెంటరీ వ్యవహా రాల మంత్రి ఎం. వెంకయ్య నాయుడు మండిపడ్డారు. ప్రధానిని క్షమాపణలు కోరే నైతిక హక్కు పత్రిపక్షాలనికి లేదని, గతంలో వారు ప్రధానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌కు, ప్రధానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రధానిపై ఆరోపణలు చేసి ఇప్పుడు ప్రవచనాలు చెప్పడం సరికాదని హితవు పలికారు.