కాంగ్రెస్ పని ఖతం
ముంబై: రాబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం అన్నారు. కాంగ్రెస్ రహిత భారత్‌ను ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ రహిత భారత పథకం పేరుతో ముందుకు వెళ్తాం. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లోనే ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారు. ఇప్పుడూ అదే పరిస్థితి ఉంటుంది’ అని షా అన్నారు.
మహారాష్ట్ర పర్యటన కోసం గురువారం ముంబై చేరుకున్న ఈ సీనియర్ నాయకుడికి కార్యకర్తలు స్వాగతం పలికిన సందర్భంగా మాట్లాడుతూ పైవిధంగా అన్నారు. స్వాతంత్య్రానంతరం వచ్చిన ప్రభుత్వాల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ సర్కారు అత్యంత అవినీతి, అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలు, ప్రజల సహకారంతో ఈసారి కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన షా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితుడైన అనంతరం తొలిసారిగా మహారాష్ట్ర పర్యటనకు వచ్చారు.
అసెంబ్లీలో విపక్ష నేత వినోద్ తావ్డే, బీజేపీ ముంబైశాఖ అధ్యక్షుడు ఆశిష్ శేలార్, దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ కుమార్తె పంకజ ముండే తదితరులు ముంబై ఎయిర్‌పోర్టులో ఆయనకు స్వాగతం పలికారు. బీజేపీ సీనియర్ నాయకులు రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఓపీ మాథుర్ తదితరులు షా వెంట ముంబై చేరుకున్నారు. ‘మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ స్వరాజ్యను స్థాపించాడు. మా మహాయుతి (బీజేపీ, సేన, మిత్రపక్షాల కూటమి) కూడా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది’ అని వివరించారు. విలేపార్లేలోని తావ్డే నివాసంలో సాయంత్రం ఏర్పాటు చేసిన పార్టీ కోర్ కమిటీ సమావేశానికి కూడా షా హాజరయ్యారు.
ఉద్ధవ్‌తో భేటీ
సీట్ల విషయమై ఇరు పార్టీల మధ్య విబేధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో అమిత్ షా శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రేతో గురువారం రాత్రి భేటీ అయ్యారు. అయితే వీరిద్దరి మధ్య చర్చల వివరాలు తెలియరాలేదు. తన నివాసం మాతోశ్రీకి రావాల్సిందిగా ఉద్ధవ్ స్వయంగా షాను ఆహ్వానించారని తావ్డే విలేకరులకు తెలిపారు. ఉద్ధవ్ ఆహ్వానాన్ని మన్నించి రాత్రి 9.30 గంటలకు ఆయన నివాసానికి వెళ్లారు. సీట్ల కేటాయింపు విషయంలో సేనతో తమకు ఎటువంటి విబేధాలూ లేవని తావ్డే ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఉద్ధవ్ ఠాక్రే తండ్రి, సేన మాజీ అధ్యక్షుడు, దివంగత బాల్‌ఠాక్రే స్మారకాన్ని కూడా షా సందర్శించారు. శివాజీపార్కులో ఠాక్రే స్మారకాన్ని నిర్మించడం తెలిసిందే.