మోదీపై క్షీణిస్తోన్న ప్రజా విశ్వాసం
Published Tue, Nov 29 2016 3:23 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
సాక్షి, బెంగళూరు: ప్రధాని నరేంద్రమోదీ పై ప్రజలు పెట్టుకున్న విశ్వాసం సన్నగిల్లుతోందని, భారతీయ జనతాపార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు కాంగ్రెస్‌పార్టీని విమర్శించే నైతికత లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో మూడు రోజుల పాటు జరగనున్న బెంగళూరు ఐటీ.బిజ్‌ను సోమవారం లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హత్యకేసులో నిందితుడైన అమిత్‌షాకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి లేదన్నారు. నరేంద్రమోదీ ప్రధాని కాకపోయింటే అమిత్‌షా ఈ సమయానికి జైలు జీవితం అనుభవించేవారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు ఆయన పక్కన తిరుగుతున్న యడ్యూరప్ప ఎలాంటివారో తెలుసుకోవాలని సూచించారు. యడ్యూరప్పతో పాటు డబ్బులు లెక్కించే యంత్రాలు కలిగిన కొంతమంది బీజేపీ నాయకులు జైలుకు కూడా వెళ్లి వచ్చిన విషయం బహుషా అమిత్‌షాకు గుర్తులేదేమోనని వ్యంగాస్త్రాలు సంధించారు.
వచ్చే ఎన్నికల్లో మాకే పట్టం
ప్రధాని నరేంద్రమోదీ పై ప్రజలు పెట్టుకున్న విశ్వాసం క్షీణిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. అందువల్ల రానున్న ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కచ్చితమని జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఇరవైనాలుగు గంటల్లో కావేరి, మహదాయి వివాదాలను పరిష్కరిస్తానని చెప్పిన యడ్యూరప్పకు గతం గుర్తుకు లేదేమోన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావేరి, మహదాయి వివాదాలు తలెత్తలేదా? మరి ఎందుకు అప్పుడు పరిష్కరించలేకపోయారు? అని ఈ సిద్ధరామయ్య ప్రశ్నించారు. ప్రజలు డబ్బు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే బీజేపీ నాయకులు సంభ్రమ దివస్ పేరుతో సంబరాలు జరపడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని సీఎం పేర్కొన్నారు.
Advertisement
Advertisement