21 నుంచి కొత్తపేటలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ
-
అండర్–19 బాలురు, బాలికల విభాగాల్లో నిర్వహణ
-
13 జిల్లాల నుంచీ పాల్గొననున్న 78 జట్లు
కొత్తపేట :
రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ అండర్ –19 బాలురు,బాలికల చాంపియన్ షిప్ –2016 టోర్నమెంట్‌కు కొత్తపేట రెడ్డి అనసూయమ్మ మెమోరియల్ ఇండోర్ షటిల్ స్టేడియం వేదిక కానుంది. ఈ నెల 21 నుంచి 24 వరకూ టోర్నీ నిర్వహణకు కాస్మోపాలిటన్ రిక్రియేషన్ సొసైటీ (సీఆర్‌ఎస్) ఫౌండర్, చైర్మన్, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో, జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియన్ అధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం స్టేడియంలో టోర్నీ బ్రోచర్‌ను ఎమ్మెల్సీ ఆర్‌ఎస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా చైతన్యం పెరిగేందుకు, క్రీడలను ప్రోత్సహించేందుకు బ్యాడ్మింటన్ టోర్నీని కొత్తపేటలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వివిధ క్రీడా పోటీలకు ఒకప్పుడు పేరొందిన కొత్తపేటకు ఆ వైభవం మరలా తెచ్చేందుకు ఈ పోటీలు నాంది అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సుమారు రూ.25 లక్షల వ్యయంతో స్టేడియంను ఆధునికీకరిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో ఏ క్రీడా కోర్టుకూ లేని ఏసీ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పోటీలకు వచ్చే క్రీడాకారులకు కొత్తపేట సీఆర్‌ఎస్, రావులపాలెం సీఆర్‌సీల సమన్వయంతో వసతి,ఇతర సౌకర్యాలు కలగచేస్తున్నట్టు తెలిపారు. నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లా నుంచీ బాలురు, బాలికల విభాగంలో సింగిల్స్‌లో 2, డబుల్స్‌లో ఒకటి చొప్పున ఆరేసి జట్లు పోటీల్లో పాల్గొంటాయన్నారు. ఇంతవరకూ నిర్వహించిన టోర్నీలతో పోలిస్తే ఇది మెగా ఈవెంట్ అంటూ ఎమ్మెల్సీ ఆర్‌ఎస్‌ను అభినందించారు. జిల్లా అసోసియేషన్ సలహాదారు కె.శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బండారు వెంకటసత్తిబాబు, ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్‌వుడయార్, సీఆర్‌ఎస్ ప్రెసిడెంట్ రెడ్డి శ్రీరామకృష్ణమోహన్, వైస్ ప్రెసిడెంట్ కొప్పుల భూరిబాబు, సెక్రటరీ జీపీ నాయుడు, జాయింట్ సెక్రటరీ రాయుడు శ్రీను, కోశాధికారి ఎస్.శివయ్య, సభ్యులు ఎస్.సందీప్‌కుమార్, పీఏసీఎస్ అధ్యక్షుడు కడియం భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.