పట్టుబడ్డ అక్రమ కిరోసిన్ పీపాలు
సరిహద్దులో 10వేల లీటర్ల కిరోసిన్ పట్టివేత
Published Sat, Aug 27 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
పరారీలో నిందితులు
మరోసారి ఉలిక్కిపడ్డ సరిహద్దు
ఇచ్చాపురం రూరల్ : కోట్ల రూపాయల విలువైన అక్రమ గుట్కా పట్టిన నెల రోజుల్లోనే ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతం మరోసారి ఉలిక్కి పడింది. ఈ సారి గుట్టుగా సాగిస్తున్న అక్రమ కిరోసిన్ పట్టుబడటంతో అక్రమ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. అక్రమార్కులకు అడ్డాగా పేరుపొందిన ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిల్వ ఉన్న పది వేల లీటర్ల కిరోసిన్‌ను శనివారం విజిలెన్స్ అధికారలు పట్టుకున్నారు.
వివరాలలోకి వెళ్తే...ఒడిశా నుంచి కిరోసిన్‌ను కొనుగోలు చేసి అందులో ఆంధ్రాకు సంబంధించిన నీలి కిరోసిన్ కలుపుతూ గుట్టుగా లీటర్ 45 రూపాయలకు అక్రమంగా లారీలకు అమ్ముతున్నట్లు పక్కా సమాచారంతో రూరల్ ఎస్‌ఐ ఎం.చిన్నంనాయుడుతో కలసి విజిలెన్స్ సీఐ సతీష్‌కుమార్ శనివారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్థానిక ఫైర్ స్టేషన్ సమీపంలో ఐదు గొదాంల్లో సోదాలు చేయగా 54 పీపాల్లో సుమారు 10వేల లీటర్లు అక్రమ కిరోసిన్ ఉన్నట్లు కనుగొన్నారు. 334 ఖాళీ పీపాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు ఐదు లక్షల రూపాయల విలువ గల కిరోసిన్ ఉన్నట్లు సంబంధిత అధికారులు అంచనా వేశారు. సోదాలు చేసే సమయంలో పసిగట్టిన నిందితులు పరారైనట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement