పోలీస్‌స్టేషన్ వెలుపల తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్న అరుణకుమారి
గుంటూరు ఈస్ట్: స్వయానే తల్లే తనను మోసగించిందన్న ఆవేదనతో ఓ మహిళ ముగ్గురు పిల్లలు సహా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్‌లో మంగళవారం కలకలం రేపిన ఈ ఉదంతం వివరాలిలా ఉన్నాయి. సత్తెనపల్లి పాతబస్టాండు ప్రాంతానికి చెందిన చిమట రమాదేవికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. మూడో కుమార్తె అరుణకుమారి తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. నాలుగేళ్ల క్రితం ఆమె తండ్రి శ్రీనును ఆస్తి గొడవల నేపథ్యంలో బంధువులే హత్య చేశారు. 2016లో ఆమె తల్లి రమాదేవి సుమారు రూ.7 కోట్ల విలువైన ఆస్తిని కుమారుడు అశోక్‌కుమార్ పేరిట రిజిస్టర్ చేయించారు. ఆ సమయంలో కుమార్తెల సంతకాలూ తీసుకున్నారు.
ఆస్తిలో వాటా ఇస్తానని తల్లి నమ్మించి రిజిస్ట్రేషన్ సమయంలో సంతకాలు చేయించిందని అరుణకుమారి ఆరోపిస్తోంది. మిగిలిన కుమార్తెలకు ఇచ్చినమాట ప్రకారం కొంత ఆస్తి, నగదును ఇచ్చిన తల్లి తనను మాత్రం కులాంతర వివాహం చేసుకున్నాన్న కోపంతో అన్యాయం చేసిందని ఆమె చెబుతోంది. కొద్దిరోజుల క్రితం నిలదీయగా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వనని తేల్చిచెప్పడంతో అరుణకుమారి రెండు వారాల క్రితం గుంటూరు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసింది. వారు సూచనతో సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. అయినా న్యాయం జరగకపోవడంతో మంగళవారం జిల్లా ఉన్నతాధికారులకు తన సమస్య చెప్పుకొందామని గుంటూరుకు వచ్చింది. అయితే ఎక్కడికెళ్లినా న్యాయం జరగదన్న నిరాశతో నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్‌లో ముగ్గురు పిల్లలతో సహా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. అనంతరం వారు ఆమెను నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అరుణకుమారి మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారులు తనకు న్యాయం జరిపించాలని, లేదంటే తాను బతకనంటూ కన్నీరుమున్నీరైంది. పోలీసులు ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment