విద్యార్థి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ సిబ్బందితో ఎస్పీ అమ్మిరెడ్డి
గుంటూరు ఈస్ట్: ప్రేమ విఫలమైందంటూ అరండల్‌పేట బ్రిడ్జి మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేస్తున్న విద్యార్థిని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుని ప్రాణాలు కాపాడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అరండల్‌పేట ఎస్‌హెచ్‌ఓ వాసు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి నికి చెందిన ఓ యువకుడు గుంటూరులో సీఏ ఇంటర్ పూర్తి చేశాడు. విశాఖపట్నంలోనే ఓ సంస్థలో ఏడాదిగా ఉద్యోగం చేస్తున్నాడు. గుంటూరులో సీఏ చదివే సమయంలో తోటి విద్యార్థినితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సీఏ పరీక్షల నిమిత్తం రెండు రోజుల కిందట సదరు విద్యార్థి గుంటూరు వచ్చాడు.
అయితే శుక్రవారం ఉదయం హోం మంత్రి రూట్ బందోబస్తు నిమిత్తం అరండల్‌పేట ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తుండగా ఆ విద్యార్థి ఫ్లైఓవర్‌పై వేచి చూస్తూ రైలు వచ్చే సమయానికి కిందకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన ట్రాఫిక్ హోంగార్డు శేఖర్, కానిస్టేబుల్ శివనాగేశ్వరావు అతనిని అడ్డుకోబోయారు. ఈ క్రమంలో విద్యార్థి తప్పించుకుని కిందికి దూకేందుకు యత్నిస్తుండగా సమీపంలో ఉన్న ఏఏస్‌ఐ రాధ, హెడ్ కానిస్టేబుల్ శేఖర్‌బాబు విద్యార్థిని నిలువరించి అరండల్‌పేట పోలీస్టేషన్‌కు తరలించారు. ఎస్‌హెచ్‌ఓ అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. విషయం తెలుసుకున్న అర్బన్ ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి సమయస్ఫూర్తిని ప్రదర్శించి విద్యార్థి జీవితాన్ని కాపాడిన సిబ్బందిని తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment