10 వేల చెరువులు
- మిషన్ కాకతీయ రెండో విడత లక్ష్యం
- ప్రణాళికలు రూపొందిస్తున్న ప్రభుత్వం
- వచ్చే జనవరిలోగా టెండర్ల ఖరారుకు సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయలో భాగంగా రాష్ట్రంలో రెండో విడతలో సుమారు 10 వేల చెరువులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రణాళికపై కసరత్తులో భాగంగా జిల్లాల్లోని నీటిపారుదల శాఖకు చెందిన అధికారులతో వారంలోగా సమావేశాన్ని నిర్వహించనున్నారు. తొలి విడతలో ఎదురైన అనుభవాలు, అడ్డంకులను దృష్టిలో పెట్టుకుని రెండో విడతలో సాఫీగా చెరువుల పునరుద్ధరణ పనులు జరిగేలా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2014-15లో ప్రారంభించిన తొలి విడతలో 8,500 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా నిర్దేశించారు.
అయితే అంచనాల తయారీ, ఆమోదం, పరిపాలనా అనుమతులు, టెండర్లు, ఒప్పందాలు ఆలస్యం కావడంతో గత మార్చిలో ప్రారంభించి కేవలం మూడు నెలలు మాత్రమే పనులు చేయగలిగారు. దీంతో చాలా చోట్ల పనులు అసంపూర్తిగా ఉన్నట్లు నివేదికలు అందాయి. 7,500 చెరువుల్లోనే పనులు ప్రారంభం కాగా, మరో వేయి చెరువుల్లో పనులు జరగలేదు. 2015-16కు సంబంధించి రెండో విడతలో 9 వేల చెరువులను పునరుద్ధరించడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గత ఏడాది పనులు ప్రారంభం కాని మరో వేయి చెరువులను కూడా కలుపుకుని మొత్తం 10 వేల చెరువుల్లో పనులు చేపట్టాలని నీటిపారుదల శాఖ భావిస్తోంది. రెండో విడతలో మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ జిల్లాల పరిధిలోని చెరువులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జనవరి టెండరు ప్రక్రియ పూర్తి చేసి జూన్ వరకు ఆరు నెలల పాటు పనులు జరిగేలా ప్రణాళిక చేస్తున్నారు.