కరువులోనూ 100 శాతం రుణాల రికవరీ
- రుణాలు రికవరీ చేసిన సంఘాలకు రూ. 50 వేల ప్రోత్సాహకాలు
- టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు
కరీంనగర్‌అగ్రికల్చర్: జిల్లాలో కరువు పరిస్థితుల్లోనూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు 100 శాతం రికవరీ కావడం అభినందనీయమని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు అన్నారు. రుణాల రికవరీకి కృషిచేసిన 56 సంఘాలకు రూ.50 వేల చొప్పున ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం కేడీసీసీబీ జిల్లా సర్వసభ్య సమావేశం టెస్కాచ్ చైర్మన్ అధ్యక్షతన జరిగింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.1450 కోట్ల వ్యాపార లావాదేవీలకు రూ.20.97 కోట్ల లాభం ఆర్జించిందని తెలిపారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.2000 కోట్ల వ్యాపార లక్ష్యానికి గాను ఇప్పటికే రూ.500 కోట్ల అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. ఏటా సంఘంలో ఖర్చుచేసే ప్రతి లావాదేవీలను చెక్కుల ద్వారా చేయాలని సూచించారు. సంఘాలు మైక్రో ఏజెన్సీస్ ద్వారా డిపాజిట్ మోబిలైజేషన్ చేయాలని, అలా చేసిన డిపాజిట్‌లపై మంచి కమీషన్ వస్తుందన్నారు. తద్వారా బ్యాంకులోనూ డిపాజిట్స్ పెరుగుతాయన్నారు. 15 బ్యాంకు శాఖల్లో ఏటీఎంలు, 138 మైక్రో ఏటీఎంల ద్వారా త్వరలో సేవలు విస్తరిస్తామన్నారు. నాబార్డు ద్వారా రూ.23 కోట్లు వ్యవసాయేతర రునాల మంజూరు కోసం 31 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నిధులు ఇచ్చినట్లు వెల్లడించారు. బ్యాంకు అనుబంధంగా 34 చేనేత సహకార సంఘాలు అభివృద్ధికి సహకరిస్తామన్నారు. సమావేశంలో డెప్యూటీ జనరల్ మేనేజర్ ముప్పిడి రవీందర్‌రెడ్డి, మేనేజర్ ఎ.నారాయణరెడ్డి, బ్యాంకు ఉపాధ్యక్షుడు వుచ్చిడి మోహన్‌రెడ్డి, డీసీఏవో చంద్రప్రకాశ్‌రెడ్డి, డిప్యూటీ జన రల్ మేనేజర్ జె.నారాయణ, డీఆర్, ఓఎస్‌డీ ఇంద్రసేనారెడ్డి, పీడీసీ రిసోర్స్ పర్సన్ జి.సత్యనారాయణ తదితరులు ఉన్నారు.