విశాఖలో మరో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం మద్దిలపాలెం పిఠాపురం కాలనీలోని స్టేట్‌బ్యాంక్ అపార్ట్‌మెంట్‌లో 11 నెలల చిన్నారి నవదీప్ అదృశ్యమైయ్యాడు.
విశాఖపట్నం: విశాఖలో మరో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. మద్దిలపాలెం పిఠాపురం కాలనీలోని స్టేట్‌బ్యాంక్ అపార్ట్‌మెంట్‌లో గురువారం మధ్యాహ్నం 11 నెలల చిన్నారి నవదీప్ అదృశ్యమైయ్యాడు. అపార్టమెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న బొంగ పైడిరాజు మనుమడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు.
గత రెండు రోజులుగా చిన్నారి ఆచూకీ కోసం తల్లిదండ్రులు తల్లిడిల్లిపోతున్నారు. పరామర్శించేందుకు వచ్చిన వారిని నవదీప్ తల్లి ఆరా తీయడం చుట్టుపక్కలవారిని కంటతడిపెట్టిస్తోంది. మరోవైపు మూడవపట్టణ పోలీసులు అనుమానాస్పద ప్రాంతాలలో విస్తృతంగా గాలిస్తున్నారు. నగర పోలీసు కమిషనర్ యోగానంద్ సైతం చిన్నారి కిడ్నాప్‌పై ప్రత్యేక దృష్టి సారించారు.
ఎనిమిది బృందాలతో ప్రత్యేక గాలింపు
నగరం, నగర శివారు ప్రాంతాలలో నవదీప్ ఆచూకీ కోసం ఎనిమిది పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వలస వచ్చిన కుటుంబాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆ అపార్ట్‌మెంట్ వద్ద గురువారం ఉదయం పూసలమ్మే ఒక మహిళ అనుమానాస్పదంగా తిరిగినట్లు నవదీప్ అమ్మమ్మ పైడమ్మ చెబుతోంది. ఆ పూసలమ్మే మహిళే నవదీప్‌ను కిడ్నాప్ చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ దిశగా కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.