♦ గర్భం దాల్చిన దళిత బాలిక
♦ అబార్షన్ కోసం జోగిపేటలో ప్రయత్నాలు
♦ అంగీకరించని డాక్టర్లు
♦ పోలీసు కేసుకు నిరాకరిస్తున్న కుటుంబం
జోగిపేట: బాలిక అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని ఆమెను గర్భవతిని చేసిన సంఘటన అందోలు మండలం కిచ్చన్నపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన దళిత బాలిక (14) గర్భం దాల్చడానికి కారకులెవరో చెప్పాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పట్టుబట్టారు. దీంతో దానంపల్లి గ్రామస్తుడని ఒకసారి, నారాయణఖేడ్, నిజాంసాగర్ గ్రామాలకు చెందిన వారంటూ మార్చి మార్చి చెబుతోందని వారు తెలిపారు. బాలిక తల్లి చాలా రోజుల క్రితమే చనిపోగా తండ్రి, సోదరి, సోదరుడు ఉన్నారు. అమాయకత్వంతో మోసగాళ్ల చేతిలో బలైన బాలిక ఇప్పుడు ఐదు నెలల గర్భవతి.
దీంతో ఆమెకు అబార్షన్ చేయించడానికి కుటుంబ సభ్యులు జోగిపేటలోని ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. బాలిక ప్రాణానికి ముప్పువాటిల్లే ప్రమాదముందని అబార్షన్ చేసేందుకు డాక్టర్లు నిరాకరించారు. ఈ వార్త గ్రామంలో పొక్కినా ఆ బాలిక మాత్రం తనను మోసం చేసిన వ్యక్తి వివరాలు చెప్పకుండా అతడి ఫోన్ నంబరు ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే స్పందించడం లేదని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాలిక కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని గ్రామపెద్దలు పేర్కొంటున్నారు. పోలీసు అధికారులే బాలికకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.