సాక్షి, విజయవాడ బ్యూరో: ఏడో వేతన సంఘం సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. 15 శాతం వేతనాల పెంపును సిఫార్సు చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి వేతన సంఘం నివేదిక అందజేయనుందన్న సమాచారం ఉద్యోగులను అసంతృప్తికి గురి చేస్తోంది. కేవలం 15 శాతం వేతనాల పెంపును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని రైల్వే, పోస్టల్, ఆదాయపు పన్నుల శాఖల ఉద్యోగ సంఘం నాయకులు తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట గురువారం ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేతలు పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా 49.25 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 54 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరంతా ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు పెరిగే వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. ఏడో వేతనం సంఘం 15 శాతం పెంపును మాత్రమే సిఫారసు చేసినట్లు తెలిసింది. ఆరో వేతన సంఘం 35 శాతం వేతనాల పెంపును సిఫారసు చే సిన నేపథ్యంలో ఈసారి ఈ పెంపుదల 40 శాతం ఉంటుందని ఉద్యోగులు ఆశించారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలను బట్టి ఈ మేరకు పెంపు అనివార్యమంటున్న ఉద్యోగులకు 15 శాతమే పెంచబోతున్నారన్న సమాచారం శరాఘాతంలా తాకింది.
లక్షలాది మంది ఉద్యోగులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వేతనాలను కనీసం 40 శాతం పెంచాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ఉద్యోగుల వేతనాల పెంపు 15 శాతం మాత్రమే అయితే మెరుపు సమ్మె చేపడతామని పోస్టల్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ వాసిరెడ్డి శివాజీ హెచ్చరించారు. కేంద్ర ఉద్యోగుల జేఏసీఆంధ్రప్రదేశ్ సర్కిల్ కార్యదర్శిరామచంద్రం కనీసం 40 శాతం పెంపు ఉండాలని డిమాండు చేశారు.
నేటి ధర్నాను విజయవంతం చేయండి
రైల్వే ఉద్యోగుల సమాఖ్య నేత ఎం. రాఘవయ్య పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం, కొత్త పింఛను స్కీం విధానం, ప్రైవేటీకరణ, ఔట్‌సోర్సింగ్‌కు వ్యతిరేకంగా గురువారం జరగనున్న దేశవ్యాప్త ధర్నాను విజయవంతం చేయాలని భారత రైల్వే ఉద్యోగుల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎం.రాఘవయ్య కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నా నిర్వహించాలని జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ నిర్ణయించిందని బుధవారం తెలిపారు. సర్వీసులో చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఏడో వేతన సంఘం సిఫారసులు కార్మికులకు వ్యతిరేకంగా ఉంటే వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సమ్మె తప్పదని పేర్కొన్నారు.
వేతనాల పెంపు 15 శాతమేనా?
Published Thu, Nov 19 2015 2:31 AM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM
Advertisement