దీపావళి ముందు ఉద్యోగులకు డబుల్‌ ఆఫర్‌? | 8th Pay Commission & DA Hike: Big Diwali Gift for Central Govt Employees | Sakshi
Sakshi News home page

దీపావళి ముందు ఉద్యోగులకు డబుల్‌ ఆఫర్‌?

Sep 17 2025 2:51 PM | Updated on Sep 17 2025 3:00 PM

Double Diwali Bonanza for Central Government Employees

దీపావళి పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు బంపర్‌ ఆఫర్లు ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఒకవైపు 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు కరవు భత్యం (డీఏ) పెంచాలని చూస్తుండడమే ఇందుకు కారణం. ప్రభుత్వం తీసుకునే ఈ రెండు నిర్ణయాల వల్ల ఉద్యోగుల వేతనాలు పెరుగనున్నాయి.

8వ పే కమిషన్

8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం 2025 జనవరి 16న స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్రస్థాయిలోని కీలక శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈమేరకు ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టింది. వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ కమిషన్‌ ఏర్పాటుకు సంబంధించి దీపావళి లోపు నిబంధనలు ఖరారు చేస్తారని కొందరు విశ్వసిస్తున్నారు. ఈమేరకు ఏర్పాటు చేయనున్న ప్యానెల్‌లో ఆరుగురు సభ్యులు ఉంటారు. వారు 15-18 నెలల్లో తమ నివేదికను సమర్పిస్తారు. అయితే, ఈసారి 8 నెలల్లోనే నివేదికను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. తద్వారా కొత్త సిఫార్సులను జనవరి 1, 2026 నుంచి అమలు చేసేందుకు వీలవుతుంది.

నిమిదో వేతన సంఘం దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా క్లర్కులు, ప్యూన్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) వంటి లెవల్ 1 హోదాల్లో ఉన్న వారు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంది. ప్రస్తుత 7వ సీపీసీ 31 డిసెంబర్ 2025తో ముగియనుంది. 2024 జనవరిలో 8వ సీపీసీని ప్రకటించినప్పటికీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)ను ఇంకా నోటిఫై చేయలేదు. అది పూర్తయి సభ్యులను నియమించే వరకు జీతాలు, అలవెన్సులు, పింఛన్లపై అధికారిక సమీక్ష మొదలుకాదని గమనించాలి.

కొత్త కమిషన్ కింద వేతన సవరణలో ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్ కీలకమైన అంశంగా మారుతుంది. ఇది 8వ సీపీసీ కింద ప్రస్తుత మూల వేతనాన్ని రెట్టింపు చేస్తుంది. 7వ సీపీసీ 2.57 యూనిఫామ్‌ ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌(కొత్త బేసిక్‌పేలో ఇప్పటివరకు ఉన్న బేసిక్‌పేను 2.57తో హెచ్చు వేస్తారు)ను అవలంబించింది.

డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జులై 2025 నుంచి కరవు భత్యం (డీఏ) 3 శాతం పెరిగే అవకాశం ఉందని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇటీవలి ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగా ఈమేరకు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 55 శాతం డీఏను 58 శాతానికి పెంచాలని యోచిస్తోంది. ఈ పెంపు జులై నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, దీపావళి ముందు అధికారికంగా దీనికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: కస్టమర్‌ సర్వీస్‌ కోసం ప్రీమియం చెల్లించాల్సిందే!?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement