Telangana CM KCR Announces Salary Hike For Govt Employees | ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్‌ గుడ్‌న్యూస్ - Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్‌ గుడ్‌న్యూస్

Published Wed, Dec 30 2020 1:31 AM | Last Updated on Wed, Dec 30 2020 11:15 AM

CM KCR Announces Salary Hike For Govt Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదిరిపోయే నూతన సంవత్సర కానుక అందించారు. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగ విరమణ వయసు పెంచాలని.. అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. వేతనాల పెంపుతోపాటు ఉద్యోగ విరమణ వయసు పెంపు, పదోన్నతులు ఇవ్వడం, అవసరమైన బదిలీలు చేయడం, సరళతరమైన సర్వీసు నిబంధనలు రూపొందించడం, రిటైర్‌ అయ్యే రోజే ఉద్యోగులకు అన్ని రకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలన్నింటినీ చేపట్టడం వంటి ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరిలోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు ప్రకటించారు.

అన్నిశాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపడతామని తెలిపారు. పదవీ విరమణ వయసు పెంచుతామని టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌ సభ్యులుగా త్రిసభ్య కమిటీని సీఎం నియమించారు. ‘కమిటీ జనవరి మొదటి వారంలో వేతన సవరణ సంఘం నుంచి అందనున్న నివేదికను అధ్యయనం చేస్తుంది.

రెండోవారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతుంది. వేతన సవరణ ఎంత చేయాలి? ఉద్యోగుల పదవీ విరమణ వయసు ఎంతకు పెంచాలి? సర్వీసు నిబంధనలు ఎలా రూపొందించాలి? పదోన్నతులకు అనుసరించాల్సిన మార్గమేమిటి? జోనల్‌ విధానంలో ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమించే వ్యూహమేమిటి? తదితర అంశాలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. అనంతరం కేబినెట్‌ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది’అని సీఎంఓ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.  చదవండి: (హమ్మయ్య.. ఎల్‌ఆర్‌ఎస్‌ ఉపశమనం)

ఎవరెవరికి పెరుగుతాయంటే.. 
ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్, వర్క్‌ చార్జుడ్, డెయిలీ వేజ్, ఫుల్‌ టైమ్‌ కాంటింజెంట్, పార్ట్‌ టైమ్‌ కాంటింజెంట్, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్, సెర్ప్‌ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశ వర్కర్లు, విద్యావలంటీర్లు, గౌరవ వేతనాలు అందుకుంటున్నవారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం ప్రకటించారు. తెలంగాణలో అన్నిరకాల ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తక్కువ వేతనాలున్న ఆర్టీసీ ఉద్యోగులకు కూడా జీతాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. అవసరమైతే వేతనాల పెంపుతో ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం ప్రకటించారు. 

పరిమితులకు లోబడి.. 
ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిమితుల మేర సర్కారుకు సేవలందించే అన్నిరకాల ఉద్యోగులకు కచ్చితంగా ఎంతో కొంత వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ‘రైతుల కోసం, పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా ఎన్నో చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ ఏర్పడిన వెంటనే 42 శాతం ఫిట్‌మెంట్‌తో వేతనాలు పెంచింది. ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు, తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులతోపాటు మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచింది. ఇప్పుడు మరోసారి వీరందరికీ వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది’అని సీఎం పేర్కొన్నారు.  చదవండి: (ఆరు నెలల్లో ‘సింగరేణి’ ఖాళీల భర్తీ: ఎన్‌.శ్రీధర్‌)

రెండు నెలల్లో మొత్తం పూర్తికావాలి.. 
‘సమైక్య రాష్ట్రంలో ఉద్యోగుల ప్రతి అంశం చిక్కుముడిగా ఉండేది. ఏది ముట్టుకున్నా పంచాయితీ, కోర్టు కేసులే ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కొనసాగాయి. ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నోసార్లు సంప్రదింపులు జరిపి, న్యాయ వివాదాలను పరిష్కరించుకొని ఇప్పుడిప్పుడే అన్ని విషయాల్లో స్పష్టతకు వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా విధులు నిర్వర్తించే సౌలభ్యం కల్పించడానికి మార్గం సుగమమైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉద్యోగులకు సంబంధించిన అంశాలన్నింటినీ పరిష్కరించాలి. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మొత్తం ప్రక్రియ పూర్తి కావాలి. మార్చి నుంచి ఉద్యోగులంతా అన్నిరకాల సమస్యల నుంచి శాశ్వతంగా విముక్తి కావాలి’అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. 

వెంటనే పదోన్నతులు ఇవ్వాలి.. 
‘ఏపీతో వివాదం కారణంగా పోలీసు, రెవెన్యూ తదితర శాఖల్లో పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆ గొడవలన్నీ పరిష్కారమయ్యాయి. అందువల్ల వెంటనే అన్ని శాఖల్లో పదోన్నతులు ఇవ్వాలి. అన్ని శాఖల్లో వెంటనే డీపీసీలు నియమించాలి. పదోన్నతులు ఇవ్వగా ఖాళీ అయిన పోస్టులను త్వరగా భర్తీ చేయాలి. శాఖలవారీగా ఖాళీలను గుర్తించి ఫిబ్రవరిలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభించాలి’అని సీఎం సూచించారు.

‘ప్రతి ఉద్యోగి తాను ఉద్యోగంలో చేరిన నాడే తాను ఏ సమయానికి పదోన్నతి పొందుతాడో తెలిసి ఉండాలి. రిటైర్‌ అయ్యే నాటికి ఏ స్థాయికి వెళతాడో స్పష్టత ఉండాలి. దీనికి అనుగుణంగా చాలా సరళమైన రీతిలో ఉద్యోగుల సర్వీసు రూల్స్‌ రూపొందించాలి. పదోన్నతుల కోసం ఎవరివద్దా పైరవీ చేసే దుస్థితి ఉండొద్దు. ఏ ఆఫీసుకూ తిరిగే అవసరం రావొద్దు. సమయానికి ఉద్యోగికి రావల్సిన ప్రమోషన్‌ ఆర్డర్‌ వచ్చి తీరాలి. ఉద్యోగులకు తమ కెరీర్‌ విషయంలో అంతా స్పష్టత ఉండే విధంగా సర్వీస్‌ రూల్స్‌ ఉండాలి. ఆయా శాఖల్లో శాఖాధిపతులు ఉద్యోగుల సంక్షేమాన్ని కచ్చితంగా పట్టించుకోవాలి’అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

రిటైరైన రోజే అన్ని బెనిఫిట్స్‌... 
‘ఉద్యోగులు దాదాపు 35 ఏళ్లు ప్రభుత్వం, ప్రజల కోసం విధులు నిర్వర్తిస్తారు. అలాంటి ఉద్యోగులకు చాలా గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన అవసరం, బాధ్యత ఉంటుంది. నాలుగో తరగతి ఉద్యోగి నుంచి శాఖాధిపతి వరకు ఎవరైనా సరే ఉద్యోగ విరమణ పొందితే వారికి ఆ కార్యాలయంలోనే ఘనంగా సన్మానం జరపాలి. ప్రభుత్వ వాహనంలోనే ఇంటికి తీసుకెళ్లి గౌరవంగా వీడ్కోలు పలకాలి. ఉద్యోగ విరమణ చేసిన రోజే రావాల్సిన రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అన్నీ అందించాలి. రిటైర్మెంట్‌ బెనిఫిట్ల కోసం రిటైర్డు ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరిగే దురవస్థ తెలంగాణలో ఉండవద్దు’అని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. 

సత్వరమే కారుణ్య నియామకాలు 
‘ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించే కారుణ్య నియామకాల విషయంలో జాప్యం జరగడం అత్యంత విషాదకరం. దుఃఖంలో ఉన్న కుటుంబం ఉద్యోగం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం పడొద్దు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో వెంటనే కారుణ్య నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలి’అని కేసీఆర్‌ ఆదేశించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement