ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
Published Fri, Nov 25 2016 11:10 AM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM
త్వరలో వేతన సంఘం
సీఎం సిద్ధరామయ్య ప్రకటన
బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణలకు సంబంధించి రానున్న బడ్జెట్‌లో నూతన వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. శాసనమండలిలో గురువారం సిద్ధరామయ్య ఇందుకు సంబంధించిన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన పరిష్కరణకు సంబంధించి చాలా కాలంగా డిమాండ్‌లు వెల్లువెత్తున్నాయని, ఈ నేపథ్యంలో 2017 బడ్జెట్‌లో నూతన వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు గణేష్ కార్నిక్, రామచంద్రేగౌడ, అరుణ్ షహాపురలు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన పరిష్కరణ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ఉన్న తారతమ్యాలు, లభిస్తున్న సౌకర్యాలు, రోజువారీ భత్యాలు, పింఛన్లు వంటి అంశాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి వేతన పరిష్కరణను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సైతం పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి 25 వేల కోట్ల రూపాయలను వేతనాల రూపంలోనూ, 12 వేల కోట్ల రూపాయలను పించన్ల రూపంలోనూ అందజేస్తున్నట్లు వెల్లడించారు.
త్వరలో ఉద్యోగాల భర్తీ
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 7,79,000 ఉద్యోగాలున్నాయని, ఇందులో 2,69,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సీఎం తెలిపారు. ఏయే శాఖల్లో ఏయే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటిని భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హోం శాఖతో పాటు రెవెన్యూ, విద్యా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల్లోని ఉద్యోగాలను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు.
Advertisement