మృతుని కుటుంబాన్ని పరామర్శిస్తున్న మంత్రి
-
తక్షణ సహాయంగా రూ.లక్ష
-
మంత్రి జోగు రామన్న
-
డయేరియా మృతుల కుటుంబానికి పరామర్శ
నార్నూర్ : జిల్లాలోరూ.1,700 కోట్లతో పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం మండలంలోని మేడిగూడ గ్రామంలో డయేరియాతో మృతిచెందిన కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మృతుడు నాగనాథ్ భార్యకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని, కుటుంబ పోషణ కోసం రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు.
మంత్రిని నిలదీసిన మహిళలు
మేడిగూడకు చెందిన దివ్య, మాధవిలు మంత్రి రామన్నను నిలదీశారు. స్వాతంత్య్రం వచ్చి 63 ఏళ్లు అవుతున్నా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని అన్నారు. గాదిగూడ వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టక పోవడంతోనే ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు పోయాయని, పోయిన ప్రాణాలను తిరిగి ఇవ్వగలరా ప్రశ్నించారు. సరైన సమయంలో వైద్యం అంది ఉంటే ప్రాణాలు దక్కేవని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నామని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మంత్రి మాట్లాడుతూ రూ.2 కోట్లతో గాదిగూడ వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం టెండర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. గ్రామంలో తాగునీటి వసతి కోసం వాటర్‌ట్యాంకు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి కుమారులను మంచి పాఠశాలలో చేర్పించి విద్యనందిస్తామని పేర్కొన్నారు. ఎంపీటీసీ సభ్యుడు గోవింద్‌నాయక్, జెడ్పీటీసీ రూపావతి జ్ఞానోబా పుష్కర్, సర్పంచ్ దయానంద్‌నాయక్, రఘుపతి, ఐటీడీఏ పీవో కర్ణన్, ఆర్డివో ఐలయ్య, జిల్లా ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.