AP Tribal Lifestyle Special Story In Telugu: ఆకట్టుకుంటున్న గిరిజన కట్టుబాట్లు - Sakshi
Sakshi News home page

AP: ఆకట్టుకుంటున్న గిరిజన కట్టుబాట్లు

Published Tue, Aug 10 2021 2:48 PM | Last Updated on Tue, Aug 10 2021 4:19 PM

AP: Tribal Lifestyle In Western Agency - Sakshi

దట్టమైన అడవులు.. ఎత్తయిన కొండలు.. స్వచ్ఛమైన సెలయేళ్లు.. పక్షుల కిలకిలరావాలు.. పచ్చని సోయగాలు.. ప్రకృతి ఒడే ఆవాసంగా.. వన్యప్రాణుల సహవాసం మధ్య శతాబ్దాల సంస్కృతులకు గుర్తుగా నిలుస్తున్నారు పశ్చిమ ఏజెన్సీలో అడవిబిడ్డలు. దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్న వీరి జీవితాల్లో ప్రభుత్వం అభివృద్ధి వెలుగులు నింపుతోంది. వారి కష్టాలు తీర్చేందుకు బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తోంది. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు కల్పిస్తూ అన్నింటా అండగా నిలుస్తోంది. 

బుట్టాయగూడెం: అడవితల్లిని నమ్ముకుని వనాలే ఆరాధ్య దేవతలుగా, కొండుపోడు ఆధారంగా సంస్కృతి, సంప్రదాయాలతో జీవనం సాగిస్తున్నారు పశ్చిమ ఏజెన్సీలోని గిరిజనులు. తరాలు మారినా కటుటబాట్లు, ఆచార వ్యవహారాలు, ఆహార అలవాట్లలో ప్రత్యేక శైలితో ముందుకు సాగుతున్నారు. వారి అలవాట్లు, వ్యవహార శైలిని అపురూపంగా కాపాడుకుంటున్నారు. కొండపోడుతో పాటు అటవీ ఉత్పత్తులు సేకరించి వారంతపు సంతలలో అమ్ముకోవడం ద్వారా జీవనం సాగిస్తున్నారు. 

వనదేవతలే ఆరాధ్యదైవాలు
ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ గిరిజనులకు వనాలే ఆరాధ్య దేవతలు. ఎక్కడ పూజలు చేసినా తప్పనిసరిగా అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. భూదేవి, బాట, మామిడికాయ, కొత్త కందులు, చింతకాయల పండగను ప్రధానంగా చేసుకుంటున్నారు. కొండల మధ్య దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటుచేసుకుని బతుకుతున్నారు. ఏళ్ల తరబడి సమస్యలతో సహవాసం చేస్తున్న వీరి జీవితాల్లో మార్పులు వస్తున్నాయి.

ఆహారపు అలవాట్లు
కొండరెడ్ల ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉంటాయి. అడవిలో దొరికే వాటితో వంటకాలు చేసుకుని ఆ రుచుల్ని ఆస్వాదిస్తుంటారు. తొలకరి అనంతరం కొండ కోనల్లో అడుగడుగునా కన్పించే వెదురు చెట్ల నుంచి మొలిచే కొమ్ముల్ని వండుకుని ఆనందిస్తుంటారు. అలాగే ఎర్రచీమల గుడ్లతో చేసే చారు ప్రత్యేకం.

ఐటీడీఏ కృషి
ఐటీడీఏ ద్వారా గిరిజనుల సర్వతోముఖాభిృద్ధికి కృషిచేస్తున్నారు. విద్య, వైద్యం, సురక్షిత తాగునీటి, రవాణా, మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ట్రైకార్‌ ద్వారా రుణాలు ఇస్తున్నారు. జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేసి ఉపాధి బాటలు వేస్తున్నారు.  

ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రెండేళ్ల నుంచి గిరిజన అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో సుమారు 5,327 మంది పోడు రైతులకు 2 వేలకు పైగా పట్టాలు ఇచ్చారు. రూ.40 కోట్లతో బీటీ, రూ.15 కోట్లతో గ్రామీణ సీసీ రోడ్ల నిర్మాణం, నాడు–నేడు కింద రూ.15 కోట్లతో పాఠశాలల అభివృద్ధి, రూ.18 కోట్లతో సచివాలయాలు, ఆర్‌బీకేలు, విలేజ్‌ క్లినిక్‌ల నిర్మాణ పనులు చేపట్టారు. గిరిజన ప్రాంత ప్రజలకు కార్పొరేట్‌ వైద్యం అందించేలా సుమారు రూ.50 కోట్లతో మల్టీసూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి కృషి చేస్తున్నారు.

14 రోజుల్లో పట్టా
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు చింతల లచ్చిరెడ్డి. దట్టమైన అటవీ ప్రాంతం బుట్టాయగూడెం మండలంలోని రేపల్లె గ్రామం. అతనికి దాదాపు 4 ఎకరాల సొంత భూమి ఉంది. లచ్చిరెడ్డి తన భూమికి పట్టా కోసం దశాబ్దాలుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఉపయోగం లేదు. రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా అతడికి 1బీ పట్టాలు అందాయి. వలంటీర్‌ ఇంటికి వచ్చి సంతకాలు చేయించుకుని తీసుకువెళ్లగా.. 14 రోజుల్లో 1బీ పట్టాలు అందాయని లచ్చిరెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.  

ఆదివాసీల అభివృద్ధికి కృషి
ఆదివాసీలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా సీఎం వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. సంక్షేమ, అభివృద్ధి ఫలాలతో ఆదివాసీలు ఆనందంగా ఉన్నారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో రిజర్వేషన్లతో గిరిజన మహిళలకు పదవులు వరించాయి. ముఖ్యంగా గిరిజన మహిళకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను నియమించి గిరిజనులపై ఉన్న ప్రేమను సీఎం జగన్‌ చూపించారు. 
– తెల్లం బాలరాజు, పోలవరం ఎమ్మెల్యే

ముంగిళ్లలోకే పథకాలు 
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మారుమూల గిరిజన గ్రామాల్లో అడవిబిడ్డల ఇంటి ముందుకే పథకాలు వస్తున్నాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కొండ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు కష్టాలు తప్పాయి. అర్హులైన ప్రతిఒక్కరికీ పథకాలు అందుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజన పక్షపాతి. మన్యం ప్రజల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. 
– కొవ్వాసి నారాయణ, వైఎస్సార్‌ సీపీ ఎస్టీసెల్‌ జిల్లా అధ్యక్షుడు, కేఆర్‌ పురం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement