జిల్లాలో 18 హెచ్‌ఆర్‌డీ కేంద్రాలు
-
నన్నయ వర్సిటీ వీసీ ముత్యాలునాయుడు
తుని :
విద్యను పూర్తి చేసిన విద్యార్ధులకు ఉపాధి కల్పించేందుకు ఉభయ గోదావరి జిల్లాల్లో 18 మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) సెంటర్లను ఏర్పాటు చేసినట్టు ఆది కవి నన్నయ్య వర్సిటీ వీసీ ఎం.ముత్యాలునాయుడు తెలిపారు. మంగళవారం సాయంత్రం తుని పట్టణం ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెచ్‌ఆర్‌డీ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వర్సిటీ పరిధిలో 450 కళాశాలు ఉన్నాయని, ఏటా 30 వేల మంది బయటకు వస్తున్నారని, లక్ష మంది వరకు చదువుతున్నట్టు ఆయన వివరంచారు. విద్యార్థులకు ఉపాధి కల్పించేందుకు హెచ్‌ఆర్‌డీ సెంటర్లను ప్రారంభిస్తున్నామని, అక్టోబరు 17 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవు తాయన్నారు. 45 రోజుల శిక్షణ తర్వాత ఉద్యోగ మేళా నిర్వహించి డిసెంబర్‌లో పోస్టింగ్ ఇస్తామన్నారు. వికాస్ సంస్థతో సంయుక్తంగా 150 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. యూనివర్సిటీకి 39 ప్రొఫెసర్ పోస్టులు , వసతులకు రూ.46 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. వికాస్ సంస్థ ప్రతినిధి శ్రీకాంత్, ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు.