
2,539 ఎకరాల భూ పందేరం
♦ వివిధ సంస్థలకు నామమాత్రపు ధరకు కేటాయింపు
♦ రూ.2 వేల కోట్లతో చంద్రన్న దళితబాట
♦ 23 వేల స్కూళ్లలో ప్రయివేటు ఏజెన్సీలకు పారిశుధ్యపనులు
♦ ఏపీ మంత్రివర్గ నిర్ణయాలు
సాక్షి, విజయవాడ బ్యూరో : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పలు సంస్థలకు 2,538.96 ఎకరాల భూమి కేటాయించాలన్న ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పలు ప్రైవేటు సంస్థలకు నామమాత్రపు ధరకు భూములను కేటాయించాలని నిర్ణయించింది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం లో సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్‌బాబు విలేకరులకు తెలిపారు.అవి ఇలా ఉన్నాయి.
పలు సంస్థలకు భూముల కేటాయింపు ఇలా
► విశాఖ జిల్లా వాకపాడులో నావల్ అల్టర్నేట్ ఆపరేషన్ బేస్ ప్రాజెక్టు (ఎన్‌ఈఓబీ)కి ఎకరం ఐదు లక్షల చొప్పున 1070.78 ఎకరాలు.
► అనంతపురం జిల్లా ఎన్‌పీ కోటలో అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నెడ్‌క్యాప్‌కు 25 సంవత్సరాల లీజుకు ఎకరం రెండు లక్షల చొప్పున 873.23 ఎకరాలు .
► కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని గోవిందపల్లెపురం, బొమ్మవారిపల్లెపురంలో ఎకరం మూడు లక్షలు చొప్పున, కర్లకుంటలో రూ. రెండు లక్షల చొప్పున 508.070 ఎకరాలు.. ఏపీఎన్‌బీసీకి మైనింగ్ తదితరాలకు.
► నెల్లూరు జిల్లా కొత్తపట్నంలో ‘కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ లిమిటెడ్’కు ఎకరం రూ.5 లక్షల చొప్పున 46.81 ఎకరాలు.
► విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొవ్వాడ అగ్రహారంలో డెరైక్టర్, ఎస్‌వీఎల్ లైఫ్ సెన్సైస్ ప్రైవేటు లిమిటెడ్‌కు ఫార్మాస్యూటికల్, నానో కార్బన్స్ యూనిట్ ఏర్పాటుకు ఎకరం ఆరు లక్షల చొప్పున 17.65 ఎకరాలు.
► చిత్తూరు జిల్లా కేవీబీ పురం మండలం పెరిందేశం గ్రామంలో ఆదిత్య స్పిన్నర్స్ లిమిటెడ్ కంపెనీకి పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున 5.84 ఎకరాలు.
► విశాఖ రూరల్ మండలం బక్కన్నపాలెంలో శృంగేరి మఠానికి చెందిన దేవాలయ నిర్మాణానికి 3.71 ఎకరాలు.. ఎకరం రూ.30 వేల చొప్పున కేటాయింపు.
► అనంతపురం జిల్లా కదిరి మండలం కుటాగుల్లలో బ్లూమూన్ విద్యా సంస్థ స్కూల్ భవనం నిర్మాణానికి ఎకరం రూ.4.5 లక్షల చొప్పున రెండెకరాలు.
► నెల్లూరు జిల్లా తమ్మిరిపట్నంలో ‘మీనాక్షి ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్’కి ఎకరం రూ.3 లక్షల చొప్పున 7.31 ఎకరాలు, 30 ఏళ్ల లీజుకు.
► విశాఖ జిల్లా అనకాపల్లి మండలం రాజుపాలెంలో కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్ భవన నిర్మాణానికి ఎకరం రూ.20 లక్షల చొప్పున రెండెకరాలు.
► విశాఖ రూరల్ మండలంలో సీఐడీ రీజినల్ కార్యాలయం కోసం ఉచితంగా రెండెకరాలు .
త్వరలో చంద్రన్న దళితబాట..
కేబినెట్ తీసుకొన్న మరికొన్ని నిర్ణయాలు ఇలా ఉన్నాయి.... ‘‘డ్వాక్రా మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులను ఒకే గొడుకు కిందకు తెచ్చి మార్కెటింగ్ అవకాశాలను పెంచాలి. రాష్ట్రంలోని 90 లక్షల మంది పెన్షనర్లు, ఇతర లబ్దిదారుల ఆదాయం పెంపునకు ప్రణాళిక. నిర్ణీత గడువులోపు పూర్తికాని పనులకు తిరిగి టెండర్లు పిలవాలి. అవి చేయడంలో విఫలైమైన కాంట్రాక్టర్ తిరిగి అదే ప్యాకేజీ చేపట్టకుండా చర్యలు తీసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని తూర్పుగోదావరి జిల్లాలోని లబ్దిదారులకు ఇచ్చేందుకు రూ.55 కోట్లు మంజూరు. రాష్ట్రంలోని ప్రతి ఎస్‌సీ, ఎస్‌టీ కాలనీలోనూ అంతర్గత, అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి రూ. 2 వేల కోట్ల కేటాయింపు.దీన్ని ‘చంద్రన్న దళితబాట’ పేరుతో ప్రారంభించాలని నిర్ణయం.
రిపబ్లిక్‌డే సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 400 మంది ఖైదీలను విడుదలకు నిర్ణయం. జన్మభూమిని విస్తృత పరిచి డ్వాక్రా సభ్యులకు జాబ్ కార్డులివ్వాలి. శానిటేషన్, జంగిల్ క్లియరెన్స్ పనులు వారికి కేటాయించాలి. 23 వేల స్కూళ్లలో పారిశుధ్య పనులను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించి పర్యవేక్షణ బాధ్యతను ప్రధానోపాధ్యాయులకు ఇవ్వాలి.’’ ఈ నెల 31వ తేదీన రిటైర్ అవుతున్న సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సమర్థతను కొనియాడిన మంత్రివర్గం ఆయన సేవలను మున్ముందు వినియోగించుకోవాలని నిర్ణయించింది.
మంత్రులపై బాబు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ‘అచ్చెన్నా.. అన్ని శాఖల గురించి ఫిర్యాదు చేయడం నీకు అలవాటైపోయింది... ముందు నీ శాఖ గురించి నువ్వు చూసుకో’ అని సీఎం చంద్రబాబు కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడును హెచ్చరించారు. విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో శాఖలపై సమీక్ష సందర్భంగా రహదారులు, భవనాల పనితీరు పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు మాత్రం రోడ్లు సక్రమంగా లేవని అన్నారు. తనతో పాటు మిగిలిన వారు రోడ్లు బాగున్నాయని చెప్తుంటే అచ్చెన్నాయుడు బాగా లేవని చెప్పటంతో... ఈ మేరకు సీఎం అన్న ట్లు తెలిసింది. తనపేరుతో ప్రకటించిన ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ పథకాన్ని అభాసుపాల్జేశారంటూ బాబు వాపోయారు. ఆ శాఖమంత్రి పరిటాల సునీత పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో రైతుల నుంచి నిరసన వ్యక్తమౌతున్నా పసిగట్టడంలో విఫలమై న మంత్రులు పి. పుల్లారావు, పి. నారాయ ణ, దేవినేని ఉమాలపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు హైదరాబాద్‌లో నే నిర్వహించాలని సమావేశం నిర్ణయించిం ది. మార్చి తొలివారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మంత్రులు ప్రచారం చేయాలని చంద్రబాబు చెప్పారు. తాను కూడా మూడు రోజుల పాటు అక్కడ ప్రచారం చేస్తానని చెప్పారు.