
2,800 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన
అనంతపురం కల్చరల్ :
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అనంతపురం నగరంలో 2,800 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ జెండాను జిల్లాలోని రొద్దం మండల కేంద్రానికి చెందిన లక్ష్మీనారాయణ గుప్తా రూపొందించారు. జెండా ప్రదర్శనను స్థానిక టవర్‌క్లాక్ వద్ద డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి, జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి తదితరులు ప్రారంభించారు. దాదాపు నాలుగు వేల మంది విద్యార్థులు ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తూ టవర్‌క్లాక్ వద్ద నుంచి సప్తగిరి సర్కిల్, రాజురోడ్డు, శ్రీకంఠం సర్కిల్, ఆర్ట్స్ కళాశాల వరకు ఊరేగించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ భారీ ప్రదర్శనను వీడియో తీయించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సుకు పంపుతున్నామని, తప్పకుండా అందులో చోటు దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖరబాబు, ఎమ్మెల్యేలు ప్రభాకర చౌదరి, బీకే పార్థసారథి, ఎమ్మెల్సీ శమంతకమణి, మేయర్ స్వరూప, జడ్పీ చైర్మన్ చమన్ తదితరులు పాల్గొన్నారు.