– టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం
– విదేశాల్లోనూ వైభవోత్సవాలు
– 36.67 కోట్ల కొనుగోళ్లకు ఆమోదం
సాక్షి, తిరుమల:
తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలు, మౌళిక వసతుల కల్పన కోసం ఇకపై ఏటా రూ.24 కోట్లు కేటాయించాలని మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేశారు. ప్రస్తుతం ఏటా రూ.12 కోట్లు ఇస్తున్న మొత్తాన్ని రూ.24 కోట్లు పెంచుతూ తీర్మానించామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు మీడియాకు వెల్లడించారు. మరికొన్ని నిర్ణయాలివి...,
– విదేశాల్లో శ్రీవారి వైభవోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. నిర్దేశిత ప్రాంతాల్లో రెండు రోజులపాటు జరిగే ఈ వైభవోత్సవాలకు పూర్తి ఖర్చును దాతలే భరించాల్సి ఉంటుందని, లభించే హుండీ కానుకల మొత్తం టీటీడీకే చెందుతాయని తీర్మానించారు.
– ధర్మప్రచారంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ మత్సకార ప్రాంతాల్లో 500 ఆలయాల నిర్మాణంకోసం రాష్ట్ర దేవాదాయశాఖకు రూ.25 కోట్లు మంజూరు చేస్తూ టీటీడీ ఇది వరకే తీర్మానించింది. ఇందులో భాగంగానే మంగళవారం రూ.5 కోట్లు నిధులు విడుదలకు ఆమోదించింది.
– గుజరాత్‌రాష్ట్రం అహ్మదాబాద్‌లోని టీటీడీ కల్యాణ మండపం, ఆడిటోరియం నిర్మాణాకి రూ.3.45 కోట్లు, చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో టీటీడీ కల్యాణ మండపం నిర్మాణానికి రూ.1.25 కోట్లు, గుంటూరు జిల్లా ఎడ్లపాడులో కల్యాణ మండపం నిర్మాణానికి రూ.1.25 కోట్లు మంజూరు.
– చిత్తూరు జిల్లా పాకాల మండలం ఉట్లవారిపల్లెలోని సుబ్రమణ్యస్వామి ఆలయం చెంత డార్మిటరిహాలు, అదనపు గదుల నిర్మాణానికి రూ.95 లక్షలు, తూర్పుగోదావరి జిల్లా కరప మండలం జడృభవరం గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం పుననిర్మాణం కోసం రూ.20.70 లక్షలు, విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో రాయాలయం పునర్నిర్మాణం కోసం రూ.22.50 లక్షలు మంజూరు.
– కడప జిల్లా ఖాజీపేట మండలం పుల్లూరు గ్రామంలో నాగేశ్వరస్వామివారి ఆలయంలో ఆలయ మరమ్మతులకు రూ.19.80 లక్షలు, మైదుకూరు మండలం వనిపెంట గ్రామంలోని చెన్నకేశవస్వామి వారి ఆలయ గోపురం, సాలహారం నిర్మాణం కోసం రూ.22.50 లక్షల మంజూరు.
– టీటీడీ ఆస్థాన సిద్దాంతిగా మూడు సంవత్సరాల కాలపరిమితితో తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్ నియామకం.
– 2017 సంవత్సరానికి 10 లక్షల డైరీల ముద్రణకు ప్రయివేట్ ముద్రణకు ఆమోదం.
– టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల దంత చికిత్స నిమిత్తం నిర్దేశిత ఆస్పత్రుల జాబితాలో కృష్ణతేజ సూపర్‌స్పెషాలిటీ దంతవైద్యశాలకు అనుమతి.
రూ.36.67 కోట్ల కొనుగోళ్లకు ఆమోదం
2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.36.67 కోట్ల కొనగోళ్లకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఇందులో రూ.3.01 కోట్లతో టీటీడీ ఆస్పత్రులకు మందుల కొనుగోలు. రూ.8.46 కోట్లతో హర్యానలోని కర్నాల్ మిల్క్‌ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ ద్వారా 2.25 లక్షల కిలోలు ఆవు నెయ్యి కొనుగోలు.
రూ.6.52 కోట్లతో ఏపీ, తెలంగాణ రైస్‌మిల్లర్ల ద్వారా 16.32 లక్షల కిలోల సోనమసూరి పాత బియ్యం కొనుగోలు. రూ.3.05 కోట్లతో 2 లక్షల కిలోల ఎండుద్రాక్ష కొనుగోలు. రూ.1.50 కోట్లతో 1.80 లక్షల కాటన్ ఉత్తరీయాలు కొనుగోలు. రూ.1.47 కోట్లతో 3.60 కోట్ల పేపర్ కప్పులు కొనుగోలు. రూ. 1.38 కోట్లతో 2.50 లక్షల కాటన్ బ్లౌజ్‌ఫీసులు కొనుగోలు. రూ.11.28 కోట్లతో 39.32 లక్షల లీటర్ల టోన్డ్‌పాలు కొనుగోలు. అలాగే, చింతపండును హిందూపురం చింతపండి మండీ వర్తకుల సమైఖ్యద్వారా, బెల్లం అనకాపల్లి వర్తకుల నుండి కొనుగోలుకు ఆమోదించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను టీటీడీ చైర్మన్,ఈవో , సభ్యులు ఆవిష్కరించారు.
బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట
– మీడియాతో చైర్మన్,ఈవో
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే పెద్ద పీట వేస్తామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఆలయ వీధుల్లో వాహన సేవలతోపాటు ఆలయంలో మూలమూర్తి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. బ్రహ్మోత్సవాల్లో కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని, వారి సిఫారసులకు ఉండబోవని స్పష్టం చేశారు. ఉత్సవాల రోజుల్లో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశామన్నారు. ఇటీవల నిర్వహించిన ఈ–వేలం ద్వారా టీటీడీకి జూలై,2016లో రూ.11.88 కోట్లు, ఆగస్టులో రూ.5.94 కోట్లు ఆదాయం లభించిందన్నారు.