విశాఖపట్నం : ఉత్తర తమిళనాడు తీరంపై బలమైన తీవ్రవాయుగుండం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. ఇది క్రమేణ బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. అయితే మరో 24 గంటలపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు పడతాయని... కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.
ఉత్తర కోస్తాలోనూ చెదురుమదురు వర్షాలు పడతాయని పేర్కొంది. అయితే దక్షిణ కోస్తాలో గంటకు 50 -55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని... అలాగే ఉత్తర కోస్తాలో గంటకు 45 - 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. కాగా అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక అలాగే కొనసాగుతున్నట్లు చెప్పింది.