
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీరాల్ని ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది క్రమంగా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర మధ్యప్రదేశ్ వైపు కదులుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర–దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి దక్షిణ తెలంగాణ వరకూ 0.9 కిమీ ఎత్తులో ఉంది.
వీటి ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గురువారం ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో గరివిడిలో 4 సెంమీ, పూసపాటిరేగ, కళింగపట్నం, భీమిలి, అమలాపురంలో 3 సెంమీ వర్షపాతం నమోదైంది.