రూ.24 లక్షలకు కుచ్చుటోపీ
Published Sun, Aug 7 2016 1:11 AM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
– ఉడాయించిన సహకార బ్యాంకు డైలీ డిపాజిటర్ ఏజెంట్
– లబోదిబోమంటున్న బాధితులు
కోవెలకుంట్ల:
కోవెలకుంట్ల సహకార బ్యాంకులో డైలీ డిపాజిటర్ ఏజెంట్ డిపాజిట్ సొమ్ముతో ఉడాయించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులు అందించిన సమాచారం మేరకు వివరాలు... పట్టణానికి చెందిన నాగరాజు గత 20 సంవత్సరాల నుంచి సహకార బ్యాంకులో డైలీ డిపాజిటర్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. నూర్ అహమ్మద్, రంగడు, పుల్లయ్య, రామిరెడ్డి, అమీర్, నారాయణరెడ్డి, సావిత్రి, ప్రసాదు, వెంకటేశ్వరరావు, గణేష్‌రెడ్డి, దస్తగిరి, బాష, గోవిందు, చౌడయ్య, సుధాకర్‌రెడ్డి, శివభాస్కర్‌రెడ్డి, మరో 50 మంది ఏజెంట్ వద్ద ప్రతి రోజు రూ. వంద నుంచి రూ. 3వేల వరకు ఏజెంట్ వద్ద డిపాజిట్ చేశారు. ఏడాదిపాటు రోజుకు రూ. వంద చెల్లించిన లబ్ధిదారునికి ఏడాది ఆఖరులో బ్యాంకు రూ. 36,800 చెల్లిస్తుంది. ఆరు నెలల నుంచి లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా వాడుకున్నట్లు తెలుస్తోంది. డిపాజిటర్ల నుంచి సుమారు రూ. 24 లక్షలు వసూలు చేసి ఇటీవల కన్పించకుండా పోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 40 మంది లబ్ధిదారులు ఏడాదికాలం చెల్లించగా వారికి వడ్డీతో సహా మొత్తాన్ని అందజేయాల్సి ఉంది. ఈ తరుణంలో ఏజెంట్ కన్పించకపోవడంతో బాధితులు బ్యాంకును చేరుకుని తమకు న్యాయం చేయాలని అధికారులను విన్నవించుకున్నారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ కష్ణమూర్తి మాట్లాడుతూ ఏజెంట్ లబ్ధిదారుల నుంచి డిపాజిట్ వసూలు చేసి బ్యాంకులో జమ చేయలేదన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందన్నారు. సహకార బ్యాంకు జిల్లా శాఖకు ఫిర్యాదు చేయగా ఈ సంఘటనపై విచారణ అధికారిని నియమించినట్లు తెలిపారు. ఏజెంట్‌కు సంబంధించిన రికార్డులు, రసీదులు, తదితర అంశాలను పరిశీలించగా రూ. 12 లక్షలకు సంబంధించి లెక్కల్లో తేడాలు ఉన్నట్లు తేలిందన్నారు. డిపాజిటర్లు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని డిపాజిట్ చేసిన సొమ్మున చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Advertisement
Advertisement