కార్మికుల అణచివేత విధానాలు తగదు
సత్తెనపల్లి (గుంటూరు): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను అణచివేయడానికి నిరంకుశ పద్ధతులు అవలంబిస్తున్నాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి విమర్శించారు. సెప్టెంబరు 2న 11 కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె ప్రాధాన్యతను వివరిస్తూ స్థానిక ఎన్జీవో హోమ్‌లో గురువారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. ఈసదస్సుకు సీఐటీయూ సత్తెనపల్లి డివిజన్ ఉపాధ్యక్షులు పెండ్యాల మహేష్ అధ్యక్షత వహించారు. రాధాకృష్ణ మాట్లాడుతూ 2015లో కార్మిక సంఘాల సమ్మె సందర్భంగా 12 డిమాండ్‌లు పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారు. ధరలు పెరుగుతున్నా ప్రధాని మోదీ నుంచి స్పందన కరువైందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం సమ్మెలు, ధర్నాలు సహించనని కఠినంగా అణచివేస్తామని హెచ్చరిస్తున్నారన్నారు. కార్మికులను ఎటువంటి బలప్రయోగాల ద్వారా అణచలేరని, ఈ సమ్మె ద్వారా కార్మికుల సత్తా చాటుతామని పేర్కొన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి వి.వి.కె.సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వాలకు కార్మికుల గోడు వినిపించడం లేదన్నారు. తప్పని పరిస్థితుల్లోనే సెప్టెంబరు 2న దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్ర కార్మిక సంఘాలన్ని సమ్మెకు సన్నద్ధమయ్యాయని చెప్పారు. కార్మికుల సహనాన్ని చేతకాని తనంగా చూడొద్దని హెచ్చరించారు. సదస్సులో ఐఎన్‌టీయూసీ ప్రతినిధి మాదంశెట్టి వేదాద్రి, వైఎస్సార్‌టీయూ ప్రతినిధి గరికపాటి ప్రభాకరరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కంబాల శ్రీనివాసరావు, సీఐటీయూ సత్తెనపల్లి డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.ఆంజనేయులు నాయక్, గుంటూరు మల్లేశ్వరి, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి పొత్తూరి రామకోటయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి అవ్వారు ప్రసాదరావు, ముఠా వర్కర్స్ అధ్యక్షుడు తోటా పుష్పరాజ్, ఎస్టీయూ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఎస్.కె.సుభాని, ఆటో వర్కర్ యూనియన్ నాయకులు డీఆర్ మస్తాన్, ఎం.హరిపోతురాజు, వంకాయలపాటి ప్రభాకరరావు మాట్లాడారు. సదస్సులో వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.