3,532 మంది ముక్తకంఠానికి లిమ్కా..
రసూల్‌పురా: సారే జహాసె అచ్చా..హిందూ సితా హమారా.. అంటూ దేశభక్తి గీతం ఆలపిస్తూ మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తూ 3,532 మంది విద్యార్థులు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును సాధించారు. కంటోన్మెంట్ బాలంరాయిలోని గీతాంజలి దేవశాల పాఠశాల అధ్వర్యంలో బుధవారం ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. పాఠశాల వార్షికోత్సవంతో పాటు పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం అలరించింది. దేశ ప్రజల్లో జాతీయ భావం పెంపొందించే విధంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో
గీతాంజలి పాఠశాలల ఐదు బ్రాంచీల విద్యార్థులతో పాటు నగరంలోని మానసిక, శారీరక వికలాంగుల ఆరు పాఠశాలల విద్యార్థులు భాగమయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సేవ చేస్తున్న పాయల్ కపూర్, జ్యోతి, స్రవంతిను ఘనంగా సన్మానించారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. పాఠశాలల చైర్మన్ ఉమాకరణ్, డైరక్టర్ గీతాకరణ్, ప్రిన్సిపల్ మాధవి చంద్ర, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.