‘మూషిక్’వాహనం
భలే బుర్ర
మూషిక వాహనాన్ని అధిరోహించి వినాయకుడు ముల్లోకాలూ తిరిగినట్లు పురాణాల్లో చదువుకున్నాం. వినాయకుడు అధిరోహించిన మూషికం సజీవ వాహనం. దానికి కడుపు నిండా ఆహారం తప్ప ఇంధనం అక్కర్లేదు. కానీ మన వాహనాలు అలా కాదు కదా!
ఇంధనానికి కొరత తీవ్రమవుతున్న ఈ రోజుల్లో తక్కువ ఇంధనంతో అత్యధిక దూరం ప్రయాణించే వాహనాలను చాలా కంపెనీలు రూపొందిస్తున్నాయి. వాటి రూప కల్పనకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. అయితే, పెద్దగా ఖర్చు లేకుండానే ఈ ‘మూషిక్’ వాహనాన్ని సృష్టించాడు మైసూరుకు చెందిన సంతోష్. ఫొటోలోని ‘మూషిక్’ వాహనంపై కనిపిస్తున్న యువకుడు ఇతగాడే.
తొలుత సంతోష్ ఒక ఫార్మసీ కంపెనీలో పనిచేసేవాడు. ఇతగాడు సృష్టించిన ‘మూషిక్’... ఒక అధునాతన బైక్. దీని తయారీకి సంతోష్ పెద్దగా కష్టపడిందేమీ లేదు. పాతబడ్డ మోటార్ సైకిళ్ల విడి భాగాలను తనకు కావలసిన రీతిలో అమర్చాడు. పెట్రోల్ ట్యాంకు లాంటివేమీ లేకుండా, బ్యాటరీతో నడిచేలా తీర్చిదిద్దాడు. అయితే, దీనిని నడపడానికి మాత్రం ఎవరైనా సరే, ఈ ఫొటోలో ఉన్న భంగిమలో మార్చుకోవాల్సిందే! ఎందుకంటే, దీని హ్యాండిల్ ముందుచక్రం ఇరుసును అతుక్కుని ఉంటుంది మరి.
ఈ అధునాతన ‘మూషిక్’ వాహనాన్ని రూపొందించిన సంతోష్‌కు ఇంజినీరింగ్‌లో ఎలాంటి డిగ్రీ లేదు. అయినా, ఈ వాహనం ఇతగాడి పేరును లిమ్కాబుక్‌లోకి ఎక్కించింది. సంతోష్ ఇలాంటివే మరికొన్ని విలక్షణమైన బైక్‌లను రూపొందించాడు. తన తండ్రికి మోటార్ సైకిళ్లంటే తగని ఇష్ట మని, తనకు కూడా చిన్న వయసు నుంచే బైక్‌లపై ఇష్టం పెరిగిందని, తన తండ్రి స్ఫూర్తితోనే కొత్త కొత్త బైక్‌లను రూపొం దిస్తున్నానని చెబుతున్నాడు సంతోష్.