లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో దంపతులకు చోటు
–వేర్వేరు సంవత్సరాల్లో ఒకే సమయంలో పిల్లలకు జననం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరానికి చెందిన దంపతులకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. స్థానిక నరసింహారెడ్డి నగర్‌లో నివసించే మహబూబ్‌నసీర్ మెడికల్ విభాగంలో పనిచేస్తారు. ఆయన భార్య రుబీనా సుల్తానా(34) 2015 ఏప్రిల్ 9వ తేదీన ఉదయం 6.45 నిమిషాలకు అమ్మాయి(ఆయేషా నౌసీన్)కు జన్మనిచ్చింది. రెండో కాన్పులోనూ ఆమె 2016 ఏప్రిల్ 9వ తేదీన ఉదయం 6.33 నిమిషాలకు మగబిడ్డ(మహబూబ్ సాబీద్)కు జన్మనిచ్చింది. వీరిద్దరూ స్థానిక గాయత్రి ఎస్టేట్‌లోని అశ్విని హాస్పిటల్‌లో జన్మించారు. వేర్వేరు సంవత్సరాల్లో సరిగ్గా ఏడాది సమయంలో ఒకే తేదీన, దాదాపుగా ఒకే సమయంలో పిల్లలకు జన్మనివ్వడంతో రుబీనా సుల్తానా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కింది. ఈ మేరకు ఆ సంస్థ ఎడిటర్ విజయ ఘోష్ అవార్డు పత్రం పంపించారు. ఏప్రిల్ 9 వ తేదీన ఆ దంపతులకు పత్రం అందించి సన్మానం చేయనున్నారు. కాగా రుబీనాసుల్తానా.. తన తల్లిదండ్రులు మోయినుద్దీన్, రపీయాబీ స్థాపించిన రుబీనా ఉమెన్ వెల్ఫెర్ అసోసియేషన్ నిర్వహిస్తోంది.