మూడు సంవత్సరాల చిన్నారి నీటిసంపులో పడి మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని ఘడియగౌరారం గ్రామంలో చోటు చేసుకుంది.
చింతపల్లి: మూడు సంవత్సరాల చిన్నారి నీటిసంపులో పడి మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని ఘడియగౌరారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జక్కుల జంగయ్య, సరిత మూడవ కుమార్తె జక్కుల భవాని (3) గ్రామంలోని పాఠశాలలో యూకేజీ చదువుతోంది. గురువారం పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్ద ఆడుకుంటోంది.
ఇంటి ఆవరణలో ఉన్న సంపులో నీటిని బాటిల్‌తో ముంచేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. ఈ విషయాన్ని సరిత గమనించకపోవడంతో అక్కడికక్కడే మృతిచెంది నీటిపై తేలడంతో విషయం బయటపడింది. కొంత సేపటికి నీటిపై తేలుతున్న శవాన్ని చూసిన సరిత కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి భవానిని సంపులో నుంచి బయటకు తీశారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.