water sump
-
సంపులో పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
హైదరాబాద్: ప్రమదవశాత్తు సంపులో పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వైరా మండలం గార్లకు చెందిన ఖలీల్ పాషా కుమారుడు షేక్ అక్మల్ సుఫుయాన్ (25) సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని షుణ్ముక్ మెన్స్ పీజీ హాస్టల్లో నివాసముంటున్నాడు. సోమవారం ఉదయం 10.30 గంటలకు జిమ్‌కు వెళ్లి తిరిగి హాస్టల్‌కు వస్తుండగా దారిలో తెరిచి ఉంచిన నీళ్ల సంపులో ప్రమాదవశాత్తు అక్మల్ పడిపోయాడు. తీవ్రగాయాలు కావడం, నీటిలో పడడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ మేనేజర్ కె. మధుసూదన్‌రెడ్డి నిర్లక్ష్యంతో వ్యవహరించినందునే ఘటన చోటుచేసుకుందని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Continuation of video… pic.twitter.com/w6CNRNIQMx — Sudhakar Udumula (@sudhakarudumula) April 22, 2024 -
చంపేందుకు ఎందుకు కన్నావమ్మా!?
నవ మాసాలూ మోసి.. రక్తం పంచిన బిడ్డల్ని అత్యంత దారుణంగా తల్లులే హత్య చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న భర్తతో గొడవ పడి ఓ తల్లి ఏకంగా తన బిడ్డ చేతిని కోసి ప్రాణాలు విడిచే వరకూ అలానే చూస్తుండిపోయిన ఘటన అనంతపురం జిల్లాలో చూశాం. ఆడబిడ్డ పుట్టిందని ఆస్పత్రిలోని నీటితొట్టిలో వేసి బిడ్డ ఊపిరి తీసిన తల్లి ఉదంతాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పుడు చూస్తున్నాం. రక్తమాంసాలు పంచిన ‘అమ్మ’లే నిలువునా బిడ్డల ప్రాణాలు తీస్తుంటే.. ఇక బిడ్డలను రక్షించేదెవరు?! సాక్షి, ఏలూరు టౌన్: కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లి గ్రామానికి చెందిన కలపాల నాగేశ్వరరావు కుమారుడు హరికృష్ణకు ఆరేళ్ల కిందట చాట్రాయి మండలానికి చెందిన సీతామహాలక్ష్మితో వివాహమైంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ ఇద్దరూ జీవనం సాగిస్తున్నారు. చాలా కాలానికి సీతామహాలక్ష్మి గర్భం దాల్చింది. ప్రసూతి కోసం ఏలూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా, జూలై 30న ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే బిడ్డ మళ్లీ అనారోగ్యంగా ఉండటంతో ఈ నెల ఎనిమిదో తేదీన ఏలూరు శంకరమఠం వీధిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చిన్నారికి గొంతులో ఇన్ఫెక్షన్ ఉండటంతో ఈఎన్టీ వైద్యులు చికిత్స అందించారు. ఇదిలా ఉండగా బిడ్డ కోలుకుందని ఈ నెల 11న ఇంటికి వెళ్లొచ్చని వైద్యులు చెప్పారు. హరికృష్ణ బయటికి వెళ్లి తండ్రితో కలిసి హాస్పిటల్‌కు వచ్చేసరికి పాప కనిపించలేదు. ఆస్పత్రి అంతా గాలించినా ఫలితం లేకపోయింది. చివరికి ఆస్పత్రి ప్రాంగణంలోని నీటి తొట్టెలో ఆ చిన్నారి విగతజీవిగా కనిపించింది. టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీఐ ఆదిప్రసాద్, ఎస్ఐలు కిషోర్‌బాబు, నాగబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై తల్లిని ప్రశ్నించగా తన బిడ్డను తానే చంపినట్టు సీతామహాలక్ష్మి చెప్పింది. సీతామహాలక్ష్మికి ఆడబిడ్డ పుట్టటం ఇష్టం లేదని, దీనికి తోడు బిడ్డ అనారోగ్యంతో ఉండటంతో అస్సలు నచ్చలేదని శనివారం మీడియాతో ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ చెప్పారు. నిందితురాలిని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రిమాండ్ విధించారు. -
అదే కాంట్రాక్టర్.. అదే నిర్లక్ష్యం..
హైదరాబాద్: ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే హడావిడి చేయడం, ఆ తర్వాత మరిచిపోవడం పాలకులకు పరిపాటిగా మారింది. తప్పు చేసినట్లు తేలిన అధికారులు, కాంట్రాక్టర్లపైన కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు మళ్లీ రిపీట్ అవుతున్నాయి. శనివారం బోయిన్‌పల్లిలో నాలాలో పడి బాలుడి మృతి చెందిన ఘటనలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయితే ఇదే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఐదేళ్ల క్రితం కూడా ఓ నిండుప్రాణం బలైంది. 2015–16లో సెంటర్ పాయింట్– అశోక్‌నగర్ చౌరస్తా మార్గంలోని ఫిలిప్స్ బ్రిడ్జి పునర్ నిర్మాణ పనుల సందర్భంగా కూడా కాంట్రాక్టర్ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టలేదు. దీంతో 2016 సెప్టెంబర్‌లో రాకేశ్ అనే వ్యక్తి నాలాలో పడి మృతి చెందాడు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్, బోర్డు అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని అధికారులు హామీ ఇచ్చారు. కొద్దిరోజుల్లోనే కంటోన్మెంట్ నిబంధనల మేరకు బాధితులకు నష్టపరిహారం ఇచ్చే అవకాశం లేదని బోర్డు తీర్మానం చేసి చేతులు దులుపుకొంది. కాంట్రాక్టర్‌పైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా మళ్లీ అదే కాంట్రాక్టర్, అదే నిర్లక్ష్య వైఖరి కారణంగా బాలుడు బలయ్యాడు. ఈ సారైనా బోర్డు అధికారులు స్పందిస్తారో లేదో వేచిచూడాలి. ఈ నిర్లక్ష్యాన్ని ఏమనాలా? బోయినపల్లి ఘటనలో నాలాకు సంబంధించిన పనులు జరుగుతున్నప్పటికీ, నాలాలో పడిపోకుండా ఎలాంటి బారికేడ్లు ఏర్పాటు చేయలేదు. పెద్దలు జాగ్రత్తగా ఉండేందుకైనా కనీసం ప్రమాదహెచ్చరిక బోర్డులు కూడా లేవు. ఇది కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న పని కాగా, నగరంలోని చాలా నాలాలకు ప్రమాదాలు జరగకుండా పైకప్పు లు కానీ, ఇతరత్రా రక్షణ ఏర్పాట్లు కానీ లేవు. ఏ సంస్థ పరిధిలోనివైనా నగరంలో నాలాలు ప్రమాదకరంగా ఉన్నాయి. పైకప్పులు కానీ, మెష్‌లు కానీ లేక పలు సందర్భాల్లో పలువురు నాలాల్లో పడుతున్నారు. వానొస్తే వరద ప్రవాహం సాఫీగా వెళ్లాల్సిన నాలాలు బాలల ప్రాణాల్ని బలిగొంటున్నాయి. అడుగు తడబడో.. ఆడుకోవడానికి వెళ్లో.. ప్రమాదమని తెలియకో నాలాల వైపు వెళ్తున్న అమాయక పసిపిల్లలకు నూరేళ్లు నిండుతున్నాయి. పిల్లలే కాదు.. పెద్దలు సైతం నాలాల్లో పడి కొట్టుకుపోయి మరణించిన ఘటనలు నగరానికి కొత్తకాదు. అయినప్పటికీ, సంబంధిత విభాగాల అధికారుల బాధ్యతారాహిత్యంతో నాలాల్లో మరణాలు చర్వితచరణమవుతున్నాయి. గత సంవత్సరం నేరేడ్మెట్ ప్రాంతానికి చెందిన పన్నెండేళ్ల సుమేధ మరణించగా, ప్రస్తుతం బోయిన్పల్లి ప్రాంతంలోని చిన్న తోకట్టకు చెందిన ఏడేళ్ల ఆనంద్‌సాయి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశాయి. – సాక్షి, సిటీబ్యూరో కేటీఆర్ ప్రకటించినా... గత సంవత్సరం సుమేధ మరణంతో స్పందించిన మునిసిపల్ మంత్రి కేటీఆర్ ప్రాణాంతకంగా మారిన నాలాలకు 2 మీటర్ల లోపు వాటికి పైకప్పులు వేస్తామని, అంతకంటే పెద్దవాటిల్లో ప్రమాదాలు జరగకుండా మెష్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. యుద్ధప్రాతిపదికన దాదాపు రూ. 300 కోట్లు మంజూరయ్యాయి. కానీ పనులు మాత్రం కుంటుతున్నాయి. దాదాపు 170 కి.మీ.ల మేర నాలాల పనులకు ఈనిధులు కేటాయించగా, ఇప్పటి వరకు దాదాపు 35 కి.మీ.ల మేర పనులు మాత్రమే జరిగాయి. వేసవిలోగానే పనులు పూర్తికావాల్సి ఉండగా, పూర్తికాలేదు. అన్ని జోన్లలో వెరసి 60 పనులు ఇంకా టెండరు దశ దాటలేదు. వీటిల్లో .. 2 మీటర్ల వెడల్పు లోపు నాలాలు పనులు: 121 కి.మీ. పూర్తయింది: 23 కి.మీ. 2 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు నాలాలు పనులు: 40 కి.మీ. పూర్తయింది: 12 కి.మీ. -
ఇద్దరు బాలురను బలిగొన్న గుంత
ఉప్పల్: గృహ నిర్మాణం కోసం తవ్విన ఓ గుంత ఇద్దరు బాలుర ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఉప్పల్ న్యూశాంతినగర్లో ఉంటున్న వెంకటరావు కొడుకు రేవంత్(13), సత్యానగర్ కాలనీలో ఉంటున్న పోలెపల్లి స్వామి కుమారుడు మనోహర్(14)లు 8, 7వ తరగతులు చదువు తున్నారు. ఆదివారం వీరిద్దరు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి హెచ్ఎండీఏ బగాయత్ లేఅవుట్లో ఆడుకోవడానికి వెళ్లారు. అక్కడ సుందర్రావు తమ ఇంటి భూమి పూజకు 15 అడుగుల వరకు గోతిని తవ్వి వదిలేశారు. అందులో నీళ్లు ఊరాయి. ఆ ప్రాంతానికి ఆడుకోవడానికి వెళ్లిన రేవంత్, మనోహర్‌లు బంతి నీళ్లలో పడటంతో గుంతలోకి దిగారు. నీరు ఉండటంతో ఇద్దరు మునిగిపోయారు. బయట ఉన్నవారు బాలుర తల్లిదండ్రులకు తెలిపారు. బాలురిద్దరిని బయటకు తీసి గాంధీ ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు తో యాజమానులపై కేసు నమోదు చేశారు. ఐఫోకస్ ఎన్జీవో సభ్యులు శ్రీహరి, భరత్‌సింగ్, మైత్రి అసోసియేషన్ సభ్యులు వినోద్ యాదవ్, శేఖర్ఇవాన్, వేంకటేశ్వర శర్మ, రవిచందర్, ఉమామహేశ్వర్లపై కేసు నమోదైంది. -
ఎంత పనిచేశావ్ దేవుడా..!
మామిడితోట చూసేందుకు వెళ్లిన చిన్నారులు పక్కనే ఫారంపాండ్ (నీటికుంట) కనిపించడంతో దగ్గరకెళ్లారు. కాలుజారి ఓ బాలుడు నీటిలోకి పడిపోయాడు. అతడిని రక్షిద్దామని వెళ్లిన మరో బాలుడు కూడా పట్టుతప్పి నీటిలో పడ్డాడు. నీటమునుగుతున్న వారిని కాపాడేందుకు ఈత వచ్చిన పిన్నమ్మ (నవ వధువు) నీటికుంటలోకి దూకినా పిల్లలిద్దరూ గట్టిగా పట్టుకోవడంతో ఆమెసైతం నీటమునిగిపోయింది. సమీపంలోని వారు వచ్చి బయటకు తీసేలోపు ముగ్గురూ మృతి చెందారు. ఈ ఘటనతో పాలబావి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాప్తాడు: వర్షపునీటితో నిండిన ఫారంపాండ్ ముగ్గురిని మింగేసింది. రాప్తాడు మండలం ఎం.చెర్లోపల్లి పంచాయతీలోని పాలబావిలో ఈ సంఘటన జరిగింది. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.ఈ నెల తొమ్మిదో తేదీన హంపాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలబావికి చెందిన మాజీ స్టోర్ డీలర్ లక్ష్మినారాయణ తమ్ముడు రామకృష్ణ (45) మృతి చెందాడు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బంధువులైన హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్ రామచంద్ర, భాగ్యమ్మ దంపతులు కుమారుడు వర్షిత్ (7), కానిస్టేబుల్ శ్రీరాములు, యశోద దంపతులు చేతన్ వర్మ (17)తో కలిసి పదో తేదీన వచ్చారు. ఆదివారం వీరు తిరుగుపయనానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. తోటకెళ్లి తిరిగిరాని లోకాలకు.. మాజీ స్టోర్ డీలర్ లక్ష్మీనారాయణ మామిడి తోటను చూద్దామని పిల్లలు అడగడంతో కుటుంబ సభ్యులు శనివారం తోటకు తీసుకెళ్లారు. తోట సమీపంలోనే ఫారంపాండ్ (నీటి కుంట) ఉండటంతో ఆ గుంతలో నీటిని చూసేందుకు వర్షిత్, చేతన్ వర్మ అక్కడికి వెళ్లారు. వర్షిత్ కాలు జారి గుంతలోకి జారి పోయాడు. అతడిని కాపాడేందుకు చేతన్ వర్మ కూడా నీళ్లలోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న వీరి పిన్నమ్మ మమతతో పాటు అనూష గమనించారు. ఈత వచ్చిన మమత వారిని రక్షించేందుకు నీటిలోకి దిగింది. అయితే పిల్లలిద్దరూ గట్టిగా పట్టుకున్నారు. దీంతో ఈతకొట్టే అవకాశం లేక పిల్లలతో కలిసి ఆమె కూడా నీటమునిగింది. గట్టు మీద ఉన్న అనూష కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వారిని బయటకు తీసేలోపే ముగ్గురూ మృతి చెందారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ రామాంజనేయరెడ్డి, సీఐ భాస్కర్‌గౌడ్, ఎస్ఐ ఆంజనేయులు పరిశీలించారు. ఎంత పనిచేశావ్ దేవుడా..! అయ్యో దేవుడా... మాపై నీకు దయ లేదా? అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ముగ్గురు పిల్లల్నీ ఒకే సారి తీసుకెళ్లావా? ఒక్క రోజు గడిచి ఉంటే మేము హైదరాబాద్‌కు వెళ్లే వాళ్లం. మా బంధువు మృతి చెందాడని ఆయన్ని కడసారి చూపులు చూసుకోవడానికి వస్తే మా బిడ్డలనే నీ దగ్గరకు తీసుకుపోతివా అంటూ ఆ తల్లిదండ్రులు విలపించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. ► రామచంద్ర, భాగ్యమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడే వర్షిత్. శ్రీరాములు, యశోదమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. మాజీ స్టోర్ డీలర్ లక్ష్మినారాయణకు రామ చంద్ర, శ్రీరాములు బావమరుదులు. ► మాజీ స్టోర్ డీలర్ లక్ష్మినారాయణ ఏకైక కూతరు మమతను గ్రామంలోనే ప్రసాద్ అనే యువకుడికి ఇచ్చి నాలుగు నెలల కిత్రం అంగరంగ వైభవంగా వివాహం జరిపిం చాడు. పిల్లలను కాపాడబోయి తనూ ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు లక్ష్మినారాయణ, పార్వతమ్మ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. బాధితులకు వైఎస్సార్సీపీ నాయకుల పరామర్శ ఫారంపాండ్‌లో నీటమునిగి ముగ్గురు మృతి చెందిన విషయం తెలుసుకున్న రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు, వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి పాలబావి గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబలను పరామర్శించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బోయ రామాంజినేయులు, యూత్ మండల కన్వీనర్ చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, నాయకులు మామిళ్లపల్లి అమర్ నాథ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : ఎంపీ ఫారంపాండ్ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు, వివాహిత మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబాలను ఆదుకుంటామని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. నీటికుంటలో పడి ముగ్గురు మృతి చెందిన విషయం తెలియగానే ఎంపీ హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలకు నీటికుంటలు నిండిపోయాయని, పిల్లలు అటువైపు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సెలవు రోజుల్లో పిల్లలు సరదాగా ఆడుకునేందుకు వెళ్తూ అవగాహన లేక ప్రమాదం కొని తెచ్చుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. -
నీటితొట్టిలో పడి బాలుడి మృతి
సాక్షి, శాలిగౌరారం(నల్గొండ) : నీటితొట్టిలో పడి ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని ఆకారం గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకారం గ్రామానికి చెందిన కారింగుల శంకరయ్య–పద్మ దంపతులకు కుమార్తె, కుమారుడు శివ(9)లు ఉన్నారు. కుమార్తె కళాశాల విద్య చదువుతుండగా కుమారుడు శివ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. రోజువారీ మాదిరిగానే పాఠశాలకు వెళ్లివచ్చిన శివ సాయంత్రం రాగానే ఇంటి ఆవరణలో ఉన్న నీటితొట్టి వద్దకు కాళ్లు కడుక్కునేందుకు వెళ్లాడు. కొద్దిమేర నీరు ఉండటంతో డబ్బాతో నీటిని అందుకునేందుకు నీటితొట్టి(గోళెం)లోకి వంగాడు. దీంతో ప్రమాదవశాత్తు జారి అందులో తలకిందులుగా పడిపోవడంతో నీటిలో శివ తల మునిగి ఊపిరాడక మృతిచెందాడు. వ్యవసాయ పనులకు వెళ్లిన శివ తల్లిదండ్రులు రాత్రి ఇంటికి వచ్చి కాళ్లు కడుక్కునేందుకని నీటితొట్టి వద్దకు వెళ్లేసరికి వారి కుమారుడు నిర్జీవంగా పడిఉన్నాడు. దీంతో వారు గట్టిగా కేకలు వేస్తూ వెంటనే కుమారుడిని నీటితొట్టిలో నుంచి బయటకు తీసి చూసేసరికి మృతిచెంది ఉన్నాడు. విషయం గ్రామంలో దావనంలా వ్యాపించడంతో శివ మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు తరలివచ్చారు. ఆవిరైన తల్లిదండ్రుల ఆశలు కారింగుల శంకరయ్య–పద్మ దంపతులు తమకు ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఎన్నో ఆశలతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఇంటి ఆవరణలో ఉన్న నీటితొట్టి ఆ బాలుడి ప్రాణాలను హరించడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. తమ కుమారుడి మృతితో శివ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరిరీ కంటతడి పెట్టించింది. తల్లిదండ్రుల రోదనను చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటినిగార్చక ఉండలేకపోయారు. నాచే ప్రాణం తీసిందా..? కారింగుల శివ మరణానికి నీటితొట్టికి ఉన్న నాచే కారణమా..? అంటే.. అవునపిస్తోంది. శంకరయ్య ఇంటిలో వాడుకునే నీటికోసం ఇంటి ఆవరణలో ఉన్న సిమెంట్ నీటితొట్టి లోపలి భాగంలో పూర్తిగా నాచు పేరుకుపోయింది. నీటితొట్టిలో అడుగు భాగంలో కొద్దిమేర నీరు ఉండటంతో కాళ్లు కడుక్కునేందుకు వెళ్లిన శివ డబ్బాతో నీటిని అందుకునేందుకు దాని అంచుపై చేయిపెట్టి లోపలికి ఒరిగాడు. ఈక్రమంలో నీటితొట్టిపై ఉన్న నాచువల్ల చేయి జారడంతో అదుపుతప్పి ప్రమదవశాత్తు తలకిందులుగా జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో తల నీటిలో మునగడంతో ఊపిరాడక మృతిచెందాడు. నీటితొట్టిలో నాచులేకుంటే ప్రాణం పోయిఉండేది కాదని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. -
అదృశ్యమైన మహిళ.. ఇంట్లోని వాటర్ సంపులో..
-
అదృశ్యమైన మహిళ.. ఇంట్లోని వాటర్ సంపులో..
సాక్షి, హైదరాబాద్ : మూడు రోజుల కిత్రం అదృశ్యమైన గృహిణి వారింట్లోనే శవమై కనిపించింది. ఈ ఘటన హఫీజ్‌పేటలోని సాయినగర్‌లో బుధవారం రాత్రి వెలుగుచూసింది. స్థానికంగా తన భర్తతోపాటు నివాసముంటున్న షాజియా ఈ నెల 21 మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయింది. తన భార్య కనిపించడం లేదని ఆమె భర్త సాజోద్దీన్ మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సాజోద్దీన్ ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టగా.. నీటి సంపులో షాజియా మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న ఆమె పుట్టింటివారు ఘటనాస్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. సాజియాను హత్యచేసింది సాజోద్దీనే అని ఆరోపిస్తూ దాడికి దిగారు. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. దీంతో సాయినగర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికులు కూడా సాజియా తరపు వారిపై ప్రతిదాడి చేసేందుకు యత్నించగా.. పోలీసు బలగాలు రంగంలోకి వారిని అడ్డుకున్నారు. సాజోద్దీన్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. -
నీటిసంపులో పడిన బాలుడు
మంచాల: ఇంటి పట్టునే ఆడుకుంటున్న ఓ బాలుడు సంపులో పడి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కాగజ్‌ఘట్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. కాగజ్‌ఘట్ గ్రామానికి చెందిన యార జంగ య్య, రజిత దంపతుల కుమారుడు సాయికుమార్(7) ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. గమనించిన కు టుంబ సభ్యులు బయటకు తీశారు. బాలుడు సృహాలోలేకపోవడంతో వెంటనే చికిత్స నిమి త్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు స్పం దించకపోగా.. కనీసం చెయ్యి పట్టుకొని నాడి కూడా పరిశీలించలేదు. కుమారుడు కళ్లు తెరవలేదనే ఆందోళనలో ఉన్న కుటుంబసభ్యులు ఆవేదనతో ప్రశ్నించినా పట్టించుకోలేదు. రెండు నిమిషాలు ముందొస్తే బతికించేవాళ్లం.. దీంతో చేసేదిలేక తిరిగి ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు రెండు నిమిషాలు ముందు బాలుడిని తీసుకొచ్చి ఉంటే బతికేవాడని చెప్పడంతో ఆ తల్లిదండ్రుల రోధన మిన్నంటాయి. ఆగ్రహంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రభుత్వ ఆ స్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడి ప్రాణం పోయి ందని ఆరో పించారు. ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన వైద్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. -
మల్కాజ్‌గిరిలో బచ్పన్ స్కూల్ సీజ్
-
నీటి సంపులో పడి చిన్నారి మృతి
చింతపల్లి: మూడు సంవత్సరాల చిన్నారి నీటిసంపులో పడి మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని ఘడియగౌరారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జక్కుల జంగయ్య, సరిత మూడవ కుమార్తె జక్కుల భవాని (3) గ్రామంలోని పాఠశాలలో యూకేజీ చదువుతోంది. గురువారం పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్ద ఆడుకుంటోంది. ఇంటి ఆవరణలో ఉన్న సంపులో నీటిని బాటిల్‌తో ముంచేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. ఈ విషయాన్ని సరిత గమనించకపోవడంతో అక్కడికక్కడే మృతిచెంది నీటిపై తేలడంతో విషయం బయటపడింది. కొంత సేపటికి నీటిపై తేలుతున్న శవాన్ని చూసిన సరిత కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి భవానిని సంపులో నుంచి బయటకు తీశారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
సంపులో పురుగుల మందు కలిపిన దుండగులు
ఉంగుటూరు(పశ్చిమగోదావరి జిల్లా): ఉంగుటూరు మండలం ఉప్పకపాడు గ్రామంలోని మంచినీటి సంపులో గుర్తుతెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. మంచినీటి సంపులో పురుగుల మందు డబ్బా(కంటోల్) ఉండటాన్ని వాచ్‌మన్ గమనించడంతో ఈ విషయం బయటపడింది. అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది. ఈ విషయంపై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొండపై నీటిసంపు నిర్మాణానికి సర్వే
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంపై భక్తులకు మంచినీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు దాదాపు 10 లక్షల లీటర్ల సంపును నిర్మించేందుకు మంగళవారం సర్వే చేశారు. శివాలయం పక్కన ఉన్న నీటి ట్యాంకును కూల్చేసి దాని స్థానంలోనే నేల అడుగు భాగంలో విశాలమైన నీటి సంపును నిర్మాణం చేయడానికి అధికారులు స్థల పరిశీలన చేశారు. ఈ పనులు దసరా రోజు నుంచి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ సురేందర్‌రెడ్డి, ఎస్సీ రమణానాయక్, ఈఓ గీతారెడ్డి, దేవస్థానం అధికారులు డీఈ దయాకర్‌రెడ్డి, ఇంజనీర్లు శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ పాపారావు, సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి
రామగుండం : రామగుండం మండలం ముర్మూర్ గ్రామంలో శనివారం సాయంత్రం ఏడాదిన్నర వయస్సు గల పాప ఇంటి ముందున్న నీటిలో పడి మృతి చెందింది. ముర్మూర్‌కు చెందిన మగ్గిడి భాస్కర్, వనమాల దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ధనశ్రీ సంతానం. సాయంత్రం ధనశ్రీ ఆడుకుంటూ వెళ్లి తమ ఇంటిముందు బోర్వెల్ వద్దనున్న నీటి మడుగులో పడిపోయింది. దీనిని ఎవరూ గమనించలేదు. పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. చివరకు తమ ఇంటి ముందున్న నీటి మడుగులోనే ధనశ్రీ శవమై కనిపించింది. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. వచ్చీరాని మాటలతో సందడిగా తిరిగే పాప నీటమునిగి చనిపోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. -
నీటి కుండీలో పడి బాలుడి మృతి
నర్సాపూర్(జి)లో విషాదం దిలావర్పూర్ : మండలంలోని నర్సాపూర్(జి) గ్రామంలో ఆదివారం సాయంత్రం నీటి కుండీలో పడి ధర్మోల్ల యోగేశ్(3) మతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన శ్రీనివాస్, సాయవ్వ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు యోగేశ్. ఆదివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ సమీపంలోనే ఉన్న నీటి కుండీలో పడ్డాడు. నీట మునగడంతో ఊపిరాడక మత్యువాతపడ్డాడు. గమనించిన అతడి తల్లి సాయవ్వ, స్థానికులు కలిసి ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే బాలుడు మతిచెందాడు. మూడేళ్లకే నూరేళ్లు నిండాయా అంటూ కుటుంబసభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. నర్సాపూర్(జి) పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. -
నీటిగుంటలో పడి చిన్నారులు మృతి
అదిలాబాద్ : ఆడుకోవడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటిగుంటలో పడి మృతి చెందారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా భైంసాలో ఆదివారం వెలుగు చూసింది. స్థానిక బైపాస్ రోడ్డు ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇమ్రాన్ (12), ముజమ్మిల్ ఖురేషి (9) శనివారం పాఠశాల నుంచి వచ్చిన అనంతరం ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. వారు మళ్లీ తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన వారి తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో సమీపంలోని నీటికుంట వద్ద చిన్నారుల దుస్తూలు లభించాయి. స్థానికుల సాయంతో గుంటలో వెతకగా ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభించాయి. సదరు చిన్నారులు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
సంపులో పడి చిన్నారి మృతి
గుంతకల్లు రూరల్ (అనంతపురం): నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం డోనెముక్కల రోడ్డులోని ఇందిరమ్మ కాలనీలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆడుకుంటూ ఇంటి సమీపంలో ఉన్న చర్చి దగ్గరకు వెళ్లిన గోవర్ధన్ (2) అక్కడ నీటి నిల్వ కోసం ఏర్పాటు చేసిన సంపులో పడి మృతి చెందాడు. -
సంపులో పడి చిన్నారి మృతి
తుర్కపల్లి: నీటి సంపులో పడి ఏడాది చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలంలో చోటుచేసుకుంది. తుర్కపల్లి మండలంలోని ముల్కపల్లి గ్రామం సంగ్యా తండాకు చెందిన లావణ్య, మంగత్యా దంపతులకు చివరి కుమార్తె శరణ్య(1). ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ ఇంటి దగ్గరున్న సంపులో పడిపోయింది. కొన ఊపిరితో ఉన్న శరణ్యను తుర్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచనమేరకు హుటాహుటిన భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే శరణ్య మృతిచెందినట్టు భువనగిరి వైద్యులు తేల్చారు.