
తొమ్మిది రోజుల్లో 300 టన్నుల చెత్త ఏరివేత
బీచుపల్లి నుంచి ‘సాక్షి’ బృందం : జిల్లాలోని పుష్కరఘాట్లలో ఎప్పటికప్పుడు క్లీన్‌అండ్ గ్రీన్ చేస్తున్నారు. పుష్కారాలు ప్రారంభమై తొమ్మిది రోజుల్లో 300 టన్నుల చెత్తను ఏరివేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. తెల్లారుజామునుంచి ఘాట్లకు భక్తుల వస్తుండడంతో వారికి ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా, పారిశుద్ధ్యం లోపించకుండా చూస్తున్నారు. ప్రతి ఘాట్ వద్ద డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేసి చెత్తను అందులో వేయాలని అధికారులు మైక్‌ల ద్వారా చెబుతుండడంతో నేరుగా భక్తులు వాటిలోనే వేస్తున్నారు. రోజూ ఘాట్లలో నీటిస్థాయితోపాటు శుద్ధిని పరీక్షిస్తున్నారు. పుష్కరాల్లో లక్షాలాది మంది స్నానం చేసే ఘాట్లలో భక్తులకు ఎలాంటి చర్మవ్యాధులు ప్రబలకుండా పటిక(అలం)ను ఎప్పటికప్పుడు వేస్తూ నీటిని శుభ్రం చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో 700 మంది పంచాయతీకార్యదర్శులు, 60 మంది ఈఓఆర్‌డీలు, 500 మంది గ్రామపంచాయతీ సిబ్బంది పర్యవేక్షణలో 4 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రతకు ప్రభుత్వం రూ.4కోట్లు కేటాయించినట్లు డీపీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. కృష్ణపుష్కారాలకు వచ్చే లక్షాలాది మంది భక్తుల సౌకర్యార్థం ఎక్కడ కూడా ఘాట్లలలో చెత్తచెదారం ఉండకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తున్నట్లు పేర్కొన్నారు.