‘మన ఊరు–మన పరిశుభ్రత’  | Clean Andhra Pradesh Jaganna Swachh Sankalpam | Sakshi
Sakshi News home page

ప్రతీ గ్రామంలో అధికారుల పనితీరు కనిపించాలి: ముఖ్యమంత్రి జగన్‌

Published Fri, Apr 30 2021 3:30 AM | Last Updated on Fri, Apr 30 2021 10:03 AM

Clean Andhra Pradesh Jaganna Swachh Sankalpam - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ‘క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌) – జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని వైఎస్సార్‌ జయంతి రోజు జూలై 8న ప్రారంభించనున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ‘మన ఊరును మనమే పరిశుభ్రంగా చేసుకుందాం’ అనే నినాదంతో కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో గ్రామాలు, పట్టణాలలో పూర్తి పారిశుధ్యం కోసం మునిసిపల్‌ విభాగం పంచాయతీరాజ్‌ విభాగంతో కలిసి పనిచేయాలని సూచించారు. దీన్ని మనసా వాచా కర్మణా చేపట్టాలని, ఏ కార్యక్రమం అయినా చిత్తశుద్ధితో  పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. వచ్చే కొద్ది రోజుల్లో ప్రతీ గ్రామంలోనూ అధికారుల పనితీరు కనిపించాలని స్పష్టం చేశారు. జగనన్న కాలనీల్లో జలజీవన్‌ మిషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జగనన్న పల్లె వెలుగు కింద వీధుల్లో ఎల్‌ఈడీ లైటింగ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.               

‘వైఎస్సార్‌ జలకళ’ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల బోర్లు తవ్వాలని నిర్ణయించామని, చిన్న, మధ్య తరహా రైతులకు 1.5 లక్షల పంపు సెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియను మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. మే 1 నుంచి వంద రోజుల పాటు గ్రామాల్లో శానిటేషన్‌పై కార్యాచరణ చేపడుతున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. సీఎం గురువారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష వివరాలు ఇవీ..

పరిశుభ్రత, తాగునీరు, వీధి దీపాలు...
ప్రతి చోటా మనం ఎఫిషియెంట్‌గా ఉండాలి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్‌ చాలా ముఖ్యం. గ్రామాల్లో ఎక్కడా మురుగునీరు కనిపించకూడదు. ముఖ్యంగా మురికి వాడల్లో ఆ సమస్య ఎక్కువగా ఉంది. సీవేజ్‌ పంపింగ్‌ ఎలా ఉంది? ఆ నీటిని డిస్పోస్‌ చేయడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మురుగునీటిని ఎక్కడపడితే అక్కడికి తరలించొద్దు. ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు పంపాలి. ఘన వ్యర్థ్యాల (సాలిడ్‌ వేస్ట్‌)ను కాల్చి వదిలేయకుండా ఏం చేయాలన్న దానిపై ఎస్‌వోపీ రూపొందించండి. ప్రతి మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య కార్మికులకు వాక్సినేషన్‌ మొదలు యూనిఫామ్, గ్లౌజ్‌లు, మాస్క్‌లు, కోట్స్‌ అన్నీ అదనంగా ఇవ్వండి.

అవసరం మేరకు అన్నీ సమకూర్చండి. పారిశుద్ధ్య కార్మికులకు ఎక్కడా ఏ లోపం లేకుండా అన్నీ సమకూర్చాలి. సేవల్లో లోపం ఉండకూడదు. ‘మన ఊరును మనమే పరిశుభ్రంగా చేసుకుందాం’ అన్న నినాదంతో పనులు, కార్యక్రమాలు చేపట్టాలి. చెత్త సేకరణకు వినియోగించే  ఈ – వాహనాల (ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌) నిర్వహణ భారం కాకుండా చూడాలి.  గ్రామాల్లో శానిటేషన్, డ్రింకింగ్‌ వాటర్, వీధి దీపాలు.. ఈ మూడింటిపై ఎక్కువ వ్యయం చేయాలి. వాటికే అత్యధిక ప్రాధాన్యం. 

బోరు తవ్విన నెలలోపు కరెంట్, పంపుసెట్‌..
వైఎస్సార్‌ జలకళ  పథకం కింద  రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల బోర్లు తవ్వాలని నిర్ణయించాం. చిన్న, మధ్య తరహా రైతులకు 1.5 లక్షల పంపుసెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దీనిద్వారా 5 లక్షల ఎకరాలను సాగు నీరు అందుతుందని అంచనా. బోరు తవ్వాలని ఏ రైతు దరఖాస్తు చేసినా ఎప్పుడు బోరు వేస్తామన్నది స్పష్టంగా చెప్పాలి. అందుకోసం ఎస్‌వోపీ ఖరారు చేయాలి. ఇచ్చిన తేదీ రోజు కచ్చితంగా బోరు వేయాలి. ఆ తేదీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్‌ కాకూడదు. తేదీ ఇస్తున్నామంటే, కేవలం బోరు వేయడం మాత్రమే కాదు.. నీరు పడిన తర్వాత కచ్చితంగా నెల రోజుల లోపు విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చి పంపుసెట్‌ బిగించాలి. సొంతంగా బోర్లు వేసుకున్న రైతులు ఎవరైనా పంపుసెట్‌లు కోరితే వారికి కూడా ఇవ్వండి. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇంధన శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలి. బోర్ల లోతుపై నిబంధనలు సడలించి జియాలజిస్టులు పరీక్ష చేసి ఎంత లోతు వరకు బోరు తవ్వవచ్చు అంటే అంతవరకు వెళ్లండి. ప్రతి నియోజకవర్గంలో నెలకు కనీసం 20 బోర్లు వేయాలి. అది మీ టార్గెట్‌.
 
జగనన్న కాలనీల్లో జల్‌జీవన్‌ మిషన్‌కు ప్రాధాన్యం
జగనన్న కాలనీల్లో జల్‌జీవన్‌ మిషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. జలజీవన్‌ మిషన్‌ కింద గ్రామీణ తాగునీటి సరఫరా చేయాలి. జగనన్న కాలనీలు కూడా ముఖ్యం కాబట్టి ఈ కార్యక్రమంలో వాటిని కూడా చేర్చాలి. నీటి వనరులు, స్టోరేజీ, సరఫరా ఈ మూడింటిపై దృష్టి పెట్టి పనులు చేయాలి. వేసవిలో నీటి వినియోగం ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందే పక్కాగా ప్రణాళిక సిద్ధం చేయాలి. ప్రతి గ్రామంలో ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఎప్పుడు, ఏ ట్యాంకులు శుభ్రం చేయాలో ఒక ప్రొటోకాల్‌ రూపొందించుకోండి. ఏటా వేసనికి ముందే అన్నీ పక్కాగా ప్లాన్‌ చేయాలి. ఏలూరు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

వీధుల్లో ఎల్‌ఈడీ లైటింగ్‌ (జగనన్న పల్లె వెలుగు)..
ఎల్‌ఈడీ వీధి దీపాల వాడకం వల్ల ఏటా దాదాపు రూ.160 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. దాదాపు 4 లక్షల లైట్లు కావాలి. ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేయండి.

గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు..
ఏపీ రూరల్‌ రోడ్‌ కనెక్టివిటీ ప్రాజెక్టు (ఏపీఆర్‌ఆర్‌పీ) కింద 30 ఏళ్లుగా 30 వేల కి.మీ. బీటీ రోడ్లు మాత్రమే ఉండగా మనం అధికారంలోకి వచ్చాక 10 వేల కి.మీ రహదారుల నిర్మాణం జరుగుతోంది.

సమీక్షలో పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ గిరిజాశంకర్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్, మున్సిపల్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement