విలేజ్ మాల్స్‌లో మూడు రకాల సరుకులే..
Published Tue, Nov 29 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
– డీఎస్‌ఓ తిప్పేనాయక్ వెల్లడి
కర్నూలు(అగ్రికల్చర్): చౌక దుకాణాల్లో డిసెంబర్ నెల నుంచి మార్కెట్ ధర కంటే 20 శాతం తక్కువ ధరకు మూడు రకాల సరుకులు మాత్రమే పంపిణీ చేయనున్నారు. చౌక దుకాణాలను విలేజ్ మాల్స్‌గా మార్చి గ్రామీణ ప్రజలు ఎక్కువగా వినియోగించే సరుకులను ప్రయోగాత్మకంగా పంపిణీ చేయనున్నట్లు డీఎస్‌ఓ తిప్పేనాయక్ తెలిపారు. 5రకాల సరుకులు ఇవ్వాల్సి ఉందని.. అయితే డిసెంబర్ నెలలో వేరుశనగ విత్తనాలు, కందిపప్పు పెసరపప్పు మాత్రమే పంపిణీ చేస్తున్నామని, వీటిని కిలో ప్యాకెట్లలో ఇస్తామన్నారు. ఎండుమిర్చి పౌడరు, అయోడైజ్డ్ ఉప్పు పంపిణీ చేయాలని భావించినా సాధ్యం కాలేదన్నారు. వేరుశనగ విత్తనాలు, కందిపప్పు కిలో ప్యాకెట్లు రెండు లక్షల ప్రకారం సిద్ధం చేస్తున్నామని, పెసర పప్పు ప్యాకెట్లు మాత్రం లక్ష ప్యాకెట్లు సిద్ధం చేయిస్తున్నామన్నారు. డిమాండ్ ఉంటుందో లేదో అనే ఉద్దేశంతో లక్ష ప్యాకెట్లు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇది విజయవంతం అయితే జనవరి నుంచి కార్డుదారులందరికీ ఇస్తామన్నారు. విధిగా సరుకులు తీసుకోవాలనే నిబంధన లేదని.. కావాల్సిన వారు మాత్రమే తీసుకోవచ్చన్నారు.
Advertisement